Mahaa Daily Exclusive

  ఫైర్ సేఫ్టీ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి

Share

  • జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న
  • నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు

వరంగల్, బ్యూరో మహా;

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రైవేట్ ఆసుపత్రులు, కళాశాలలు, పాఠశాలలు, వాణిజ్య సముదాయా ల్లో అగ్నిమాపక భద్రతా (ఫైర్ సేఫ్టీ) ఏర్పాట్లు తప్పనిసరిగా నిబంధనలకు అనుగుణంగా ఉండాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం తప్పదని హెచ్చరించారు. జిడబ్లుఎంసీ అగ్నిమాపక శాఖ అధికారి శంకర్ లింగం తో కలిసి కమిషనర్ నగరంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులు, పాఠశాలలు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాజీపేటలోని డి-మార్ట్, రోహిణి ఆసుపత్రి, హనుమకొండ, వరంగల్ నగరాల్లోని పలు ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ పాఠశాలలు మరియు వాణిజ్య భవనాల్లో ఏర్పాటు చేసిన ఫైర్ సేఫ్టీ పరికరాలు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, ఫైర్ అలారం వ్యవస్థలు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు తదితర భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి భవనం యాజమాన్యం సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ వ్యవస్థలను తనిఖీ చేయించి, సంబంధిత ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్‌ ను రెన్యువల్ చేయించుకోవాలని సూచించారు. గడువు ముగిసిన ఫైర్ సేఫ్టీ అనుమతు లతో కార్యకలాపాలు నిర్వహించడం చట్టవిరుద్ధమని, అలాంటి సంస్థలపై నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నగరంలో ఇంకా ఫైర్ సేఫ్టీ వ్యవస్థలను ఏర్పాటు చేయని లేదా అవసరమైన భద్రతా పరికరాలు లేని భవనాలను గుర్తించి, ఆయా యాజమాన్యాలకు వెంటనే నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అగ్నిమాపక భద్రత అత్యంత కీలకమని, అన్ని సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించి నిబంధనలను పూర్తిగా అమలు చేయాలని సూచించారు.

ఈ తనిఖీల్లో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శంకర్ లింగం, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రాజేశ్వరరావు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్‌ఎఫ్) సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.