Mahaa Daily Exclusive

  మీసేవ సేవలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన…

Share

మీసేవ సేవలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన.
* ఒక్కరోజులోనే 2.20 లక్షల లావాదేవీలతో కొత్త రికార్డు.
* డిజిటల్ పాలనలో తెలంగాణ మరో మైలురాయి.
* ప్రజల విశ్వాసానికి నిదర్శనమన్న మంత్రి శ్రీధర్ బాబు.
హైదరాబాద్, మహా.
తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ పాలనకు ప్రతీకగా నిలిచిన మీసేవ సేవలు మరో చారిత్రక మైలురాయిని అందుకున్నాయి. గతంలో రోజుకు సగటున 70 నుంచి 80 వేల వరకు నమోదయ్యే లావాదేవీలు తాజాగా ఒక్కరోజులోనే 2.20 లక్షలకు చేరి కొత్త రికార్డు సృష్టించాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మీసేవ చరిత్రలో తొలిసారిగా రెండు లక్షల లావాదేవుల మార్క్‌ను అధిగమించడం రాష్ట్ర ఈ-గవర్నెన్స్ వ్యవస్థ బలోపేతానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యంగా ఇటీవల ప్రారంభమైన ఫ్యామిలీ కార్డు దరఖాస్తులకు ప్రజల నుంచి భారీ స్పందన లభించిందని మంత్రి వెల్లడించారు. అదే సమయంలో రవాణా శాఖకు సంబంధించిన సేవలు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఇతర పౌర సేవల కోసం కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు మీసేవ కేంద్రాలను ఆశ్రయించినట్లు తెలిపారు. ప్రభుత్వ సేవలను వేగంగా, పారదర్శకంగా, సులభంగా అందించడం వల్లే ప్రజల ఆదరణ గణనీయంగా పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి సాంకేతిక అంతరాయాలు లేకుండా లక్షలాది లావాదేవీలను విజయవంతంగా నిర్వహించిన మీసేవ సిబ్బంది, సాంకేతిక నిపుణులు, సంబంధిత శాఖల అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ సేవల డిజిటలైజేషన్‌లో వారి కృషి కీలకమైందని కొనియాడారు.
ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేలా భవిష్యత్తులో మరిన్ని ప్రభుత్వ సేవలను మీసేవ వేదిక ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆధునిక సాంకేతికతను మరింత సమర్థవంతంగా వినియోగిస్తూ సేవల నాణ్యత, వేగం, పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ప్రతి పౌరుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అన్ని సేవలను డిజిటల్ విధానంలో సులభంగా పొందేలా మీసేవ వ్యవస్థను మరింత విస్తరిస్తున్నామని శ్రీధర్ బాబు తెలిపారు. డిజిటల్ గవర్నెన్స్ అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, సాంకేతిక ఆధారిత ప్రజా సేవల విస్తరణలో రాష్ట్రం ముందంజలో కొనసాగుతుందని మంత్రి పేర్కొన్నారు.

Latest