Mahaa Daily Exclusive

  రక్ష క్లినిక్ ఉచిత హెల్త్ క్యాంప్‌కు విశేష స్పందన

Share

  • దాదాపు 100 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందులు అందజేసిన డాక్టర్ కిరణ్ కుమార్ గుడిగొండ

ఖమ్మం, ఆగస్టు 2: ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డులో శ్రీ శ్రీ శ్రీ హోటల్ లైన్, స్కూప్స్ ఐస్‌క్రీమ్ షాప్ పక్కన ఉన్న రక్ష క్లినిక్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత హెల్త్ క్యాంప్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.ఈ హెల్త్ క్యాంపును మాజీ కార్పొరేటర్ పైడిపల్లి రోహిణి సత్యనారాయణ ప్రారంభించారు. వర్షాకాలంలో జ్వరం, వైరల్ ఇన్‌ఫెక్షన్లు, ఒళ్లునొప్పులు, నీరసం, తలనొప్పి వంటి సీజనల్ వ్యాధులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో దాదాపు 100 మంది పాల్గొని ఉచిత వైద్య సేవలు పొందారు.

శిబిరంలో ప్రముఖ కార్డియో ఫిజిషియన్ & డయాబెటాలజిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ గుడిగొండ ప్రతి ఒక్కరిని స్వయంగా పరీక్షించి వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేశారు. రక్తపోటు (బీపీ), రక్తంలో చక్కెర (షుగర్), జ్వరానికి సంబంధించిన రక్త పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందులను పూర్తిగా ఉచితంగా అందజేశారు. ప్రతి రోగికి ఆరోగ్య పరిస్థితిని వివరించి తగిన చికిత్స, జీవనశైలి, ఆహార నియమాలపై సూచనలు చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ గుడిగొండ మాట్లాడుతూ, వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జ్వరం, ఒళ్లునొప్పులు, తీవ్రమైన నీరసం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని అన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటు ధరల్లో అందించాలనే లక్ష్యంతో రక్ష క్లినిక్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఉచిత ఆరోగ్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తూ ప్రజారోగ్య పరిరక్షణకు తమ వంతు కృషి కొనసాగిస్తామని చెప్పారు.

ముఖ్య అతిథిగా హాజరైన మాజీ కార్పొరేటర్ పైడిపల్లి రోహిణి సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రక్ష క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఇలాంటి ఉచిత వైద్య సేవలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. డాక్టర్ కిరణ్ కుమార్ గుడిగొండ సేవా దృక్పథంతో ప్రజలకు వైద్య సేవలు అందించడం ఆదర్శనీయమని కొనియాడారు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ పేదల ఆరోగ్య పరిరక్షణకు మరింతగా తోడ్పడాలని ఆకాంక్షించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకుని అవసరమైన సమయంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తాటి వెంకటేశ్వరరావు, ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఆకెన పవన్, చింతల రమేష్, తుమ్మల సురేష్, మట్టా వెంకటేశ్వరరావు, నల్లమోతు రామకృష్ణ, మండేపూడి కృష్ణయ్య, పుసులూరి నాగేశ్వరరావు, నల్లమోతు శ్రీనివాసరావు, ఆసుపత్రి సిబ్బంది వరలక్ష్మి, ఉమ, ప్రవీణ్, హర్షిత తదితరులు పాల్గొన్నారు.

శిబిరంలో పాల్గొన్న ప్రజలు డాక్టర్ కిరణ్ కుమార్ గుడిగొండ అందించిన ఉచిత వైద్య సేవలను అభినందిస్తూ, ఇలాంటి ఆరోగ్య శిబిరాలను నిరంతరం నిర్వహించాలని కోరారు.