- ఇంట్లోకి చొరబడి ధ్వంసం, మహిళపై దాడి ఆరోపణలు.
కర్నూలు,మహా.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అరెస్టు చేశారు. చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో ఎస్సీ వర్గానికి చెందిన కుటుంబంపై దాడి, ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడం, ఆస్తుల ధ్వంసం, మహిళపై దాడి వంటి ఆరోపణలపై నమోదైన కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన గిరి, గురునాథ్ శివ, నాగరాజు మధ్య రాజకీయ విభేదాల నేపథ్యంలో వివాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే విరూపాక్షి తన అనుచరులతో కలిసి సంగాల గ్రామానికి వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం నాగరాజు ఇంటికి వెళ్లి ఇంట్లోని సామగ్రిని ధ్వంసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనలో నాగరాజు భార్య సుచిత్రపై భౌతిక దాడి చేసి ఆమె దుస్తులు చింపివేసినట్లు, అడ్డుకునేందుకు వచ్చిన నాగరాజు సోదరుడు రాజశేఖర్‌పై కూడా దాడి చేసినట్లు బాధితులు ఆరోపించారు. అనంతరం బాధితులను పరామర్శించడానికి వచ్చిన స్థానిక నాయకుడు కొండ పురుషోత్తం వాహనాన్ని కూడా ధ్వంసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
దాడిలో గాయపడిన బాధితులను ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు ఇతర నిందితులపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. విచారణలో భాగంగా ఎమ్మెల్యేను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
మరోవైపు, ఎమ్మెల్యే అరెస్టును వైఎస్సార్‌సీపీ నేతలు ఖండిస్తూ ఇది రాజకీయ కక్షసాధింపు చర్య అని ఆరోపిస్తున్నారు. అయితే కేసులో నమోదైన ఆరోపణలు, అందుబాటులో ఉన్న ఆధారాల మేరకే చట్టప్రకారం చర్యలు తీసుకున్నామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.







