- ఉగ్రవాదుల వలలో బెంగాల్ యువ జంట.
- వీఐపీలే లక్ష్యంగా హనీట్రాప్.. పోలీసుల వేషంలో జంతర్ మంతర్ వద్ద అల్లర్లకు స్కెచ్.
- సంచలన విషయాలు వెల్లడించిన పశ్చిమ బెంగాల్ ఎస్టీఎఫ్.
ఢిల్లీ, మహా.
పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు నెరుపుతూ దేశ రాజధానిలో భారీ విధ్వంసానికి కుట్ర పన్నిన ఒక యువ జంటను పశ్చిమ బెంగాల్ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) అధికారులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో బర్ధమాన్ వద్ద హమీమ్ మోండల్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆ తర్వాత అతడిచ్చిన సమాచారంతో జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ వద్ద ప్రియురాలు అర్పితా సర్కార్‌ను అరెస్ట్ చేశారు. వీరిద్దరినీ విచారించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోని వీఐపీలను లక్ష్యంగా చేసుకుని హనీట్రాప్‌కు పాల్పడటంతో పాటు, పాక్ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు ఢిల్లీలో అల్లర్లు సృష్టించేందుకు వీరు భారీ స్కెచ్ వేసినట్లు దర్యాప్తులో తేలింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసన ప్రదర్శనల్లోకి చొరబడి ఘర్షణలు, గందరగోళం సృష్టించేందుకు ఈ జంట తీవ్రంగా ప్రయత్నించినట్లు ఎస్టీఎఫ్ అధికారులు గుర్తించారు. పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు ఈ కుట్రకు తెరలేపారు. ఇందుకోసం రక్షక భట (పోలీస్) దుస్తులను కొనుగోలు చేసి, మహిళలు, పురుషులతో కూడిన ఒక బృందంతో ఢిల్లీకి వెళ్లాల్సిందిగా హమీమ్‌కు పాక్ ఉగ్రవాదుల నుంచి స్పష్టమైన ఆదేశాలు అందినట్లు విచారణలో వెల్లడైంది. పోలీసుల వేషంలో నిరసనకారులపై దాడి చేసి శాంతిభద్రతల సమస్యను సృష్టించి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలన్నది వీరి ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.
గత నాలుగైదు నెలల క్రితమే పాక్ ఆధారిత ఉగ్రవాద నెట్‌వర్క్ ఉచ్చులో పడిన హమీమ్.. వీఐపీలు, రాజకీయ నాయకులు, సీనియర్ పోలీస్ అధికారుల సమాచారాన్ని సేకరించడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే తనకు నాలుగేళ్లుగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఉన్న అర్పితను కూడా ఈ ఉగ్ర జాలంలోకి లాగాడు. రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తులు, ఉన్నతాధికారులే లక్ష్యంగా ఈ జంట ఒక హనీట్రాప్ ముఠాను నడుపుతున్నట్లు ఎస్టీఎఫ్ విచారణలో స్పష్టమైంది. అర్పిత అందాన్ని ఎరగా వేసి ఏకంగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక సీనియర్ మంత్రి కుమారుడిని కూడా వీరు హనీట్రాప్ చేసినట్లు అధికారులు నిర్ధారించారు. అంతేకాకుండా, ప్రముఖ నాయకుల వ్యక్తిగత వివరాలు, వారి రోజువారీ కదలికలను ట్రాక్ చేసి హమీమ్‌కు చేరవేయడంలో అర్పిత కీలక పాత్ర పోషించినట్లు వెల్లడైంది. కొత్తవారిని ఈ ఉగ్ర నెట్‌వర్క్‌లోకి ఆకర్షించే బాధ్యతను కూడా వీరు భుజాన వేసుకున్నారు.
హమీమ్, అతడికి మార్గనిర్దేశం చేసే పాకిస్థాన్ హ్యాండ్లర్లు ఎప్పటికప్పుడు రహస్యంగా మాట్లాడుకునేందుకు వాట్సాప్, టెలిగ్రామ్‌తో పాటు అత్యంత భద్రత ఉండే ఎలిమెంట్ ఎక్స్ , సెషన్ వంటి ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. పాకిస్థాన్‌లోని షెహజాద్ భట్టీ గ్యాంగ్‌కు చెందిన నలుగురు ముఖ్యమైన హ్యాండ్లర్లను ఎస్టీఎఫ్ గుర్తించింది. అబీర్ జాట్333, ఉజైర్, రాణా, హమద్ అనే ఈ నలుగురు ఉగ్రవాదులు బ్రిటన్, మెక్సికో దేశాలకు చెందిన సిమ్ కార్డులను ఉపయోగిస్తూ యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యేలా బ్రెయిన్‌వాష్ చేస్తున్నారని పశ్చిమ బెంగాల్ ఎస్టీఎఫ్ ఐజీ గౌరవ్ శర్మ వెల్లడించారు.
ప్రస్తుతం అర్పితా సర్కార్‌ను న్యాయస్థానం 13 రోజుల ఎస్టీఎఫ్ కస్టడీకి అప్పగించింది. ఈ ఉగ్ర కుట్రపై దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, మున్ముందు ఈ నెట్‌వర్క్‌తో సంబంధమున్న మరికొందరిని సైతం అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఎస్టీఎఫ్ పోలీసులు స్పష్టం చేశారు. పరారీలో ఉన్న మిగతా అనుమానితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.






