Mahaa Daily Exclusive

  ఆటోమొబైల్ రంగంలో నవశకం.

Share

  •  వికసిత భారత్ దిశగా మరో మైలురాయి.
  •  ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు బలమైన అడుగు.
  •  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, మహా.

భారత ఆటోమొబైల్ రంగం మరో కీలక మైలురాయిని చేరుకుంది. స్వదేశీ సాంకేతికతతో కేటో మోటార్స్ రూపొందించిన తొలి కమర్షియల్ ఎలక్ట్రిక్ బస్సును కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఘనంగా ఆవిష్కరించారు. దేశంలో పెరుగుతున్న పట్టణ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన 9 మీటర్ల ఆధునిక ఎలక్ట్రిక్ బస్సును ఆపరేటింగ్ భాగస్వామికి అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ యాజమాన్యం, ఇంజనీర్లు, ఉద్యోగులను మంత్రి అభినందించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో తయారీ, హరిత ఇంధనం, సాంకేతికత, ఆవిష్కరణల రంగాల్లో భారత్ వేగంగా పురోగమిస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సు స్వదేశీ తయారీ సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.

  • ఆత్మనిర్భర్ భారత్‌కు మరో బలమైన అడుగు

ఒకప్పుడు వ్యాక్సిన్ల కోసం విదేశాలపై ఆధారపడిన భారత్, కోవిడ్ సమయంలో స్వదేశీ వ్యాక్సిన్లను అభివృద్ధి చేసి ప్రపంచ దేశాలకు సరఫరా చేసిన ఘనత సాధించిందని మంత్రి గుర్తుచేశారు. అదే ఆత్మనిర్భరత ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలోనూ స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

ఎలక్ట్రిక్ వాహనాలు కేవలం ప్రత్యామ్నాయ రవాణా సాధనాలు మాత్రమే కాకుండా, దేశ ఇంధన భద్రత, కాలుష్య నియంత్రణ, ముడి చమురు దిగుమతుల తగ్గింపులో కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. బ్యాటరీ తయారీ, ఛార్జింగ్ మౌలిక వసతులు, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి వంటి అన్ని రంగాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని చెప్పారు.

  • హరిత ఇంధన విప్లవం వైపు దేశం

స్వచ్ఛమైన విద్యుత్ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం సోలార్, విండ్, హైడ్రో, గ్రీన్ ఎనర్జీ కారిడార్లలో భారీ పెట్టుబడులు పెడుతోందని మంత్రి తెలిపారు. కోల్ ఇండియా, నేవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా పునరుత్పాదక ఇంధన రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు.

భవిష్యత్ సాంకేతికతకు అత్యంత అవసరమైన లిథియం, కోబాల్ట్, నికెల్, కాపర్ వంటి కీలక ఖనిజాల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం రూ.34 వేల కోట్లతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అమలు చేస్తోందని వెల్లడించారు.

  • టెక్నాలజీ హబ్‌గా తెలంగాణ

ఐటీ, ఫార్మా, డిఫెన్స్ రంగాలతో పాటు ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ డిజైన్ రంగాల్లో తెలంగాణ దేశంలో ముందంజలో ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ సెమీకండక్టర్ సంస్థలు పెట్టుబడులు పెట్టడం, తెలుగు యువ ఇంజనీర్లు ప్రపంచ స్థాయి చిప్‌ల రూపకల్పనలో భాగస్వాములు కావడం గర్వకారణమన్నారు.

సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్, పీఎల్‌ఐ పథకాలతో ఎలక్ట్రానిక్స్ తయారీ ఏడు రెట్లు, ఎగుమతులు పదకొండు రెట్లు పెరిగాయని తెలిపారు. ఈ రంగాల ద్వారా సుమారు 25 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని వెల్లడించారు.

  • వికసిత భారత్-2047 లక్ష్యానికి మరో ముందడుగు

అభివృద్ధి చెందిన మౌలిక వసతులు, వేగవంతమైన పారిశ్రామికీకరణ, స్వదేశీ సాంకేతికతతో భారత్ “వికసిత భారత్-2047” లక్ష్య దిశగా దూసుకుపోతోందని మంత్రి అన్నారు. కేటో మోటార్స్ రూపొందించిన కమర్షియల్ ఎలక్ట్రిక్ బస్సు దేశీయ సాంకేతిక ప్రతిభకు ప్రతీకగా నిలుస్తుందని, భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలతో పర్యావరణహిత రవాణా వ్యవస్థ అభివృద్ధికి సంస్థ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.