- రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ.
హైదరాబాద్, మహా.
ఇంజినీర్లను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన “క్రిమినల్ వేస్ట్” వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు.
ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఇంజినీర్లు ప్రముఖ సంస్థలకు నాయకత్వం వహిస్తూ, అంతరిక్షం నుంచి అత్యాధునిక సాంకేతిక రంగాల వరకు దేశ ప్రతిష్ఠను పెంచుతున్న సమయంలో వారిని “క్రిమినల్ వేస్ట్”గా అభివర్ణించడం అత్యంత బాధ్యతారాహిత్యమని కేటీఆర్ విమర్శించారు. దేశ ప్రగతికి కీలకంగా నిలుస్తున్న లక్షలాది మంది ఇంజినీర్లను అవమానించేలా చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించాల్సినవేనని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై స్పందించడం రాహుల్ గాంధీ నైతిక, రాజకీయ బాధ్యత అని కేటీఆర్ అన్నారు. ఈ విషయంలో ఆయన మౌనం పాటిస్తే, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించినట్లేనని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు.
యువతే రేపటి భారత నిర్మాణ శక్తి అని గుర్తుచేసిన కేటీఆర్, యువతతో విభేదిస్తే దాని రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో కాంగ్రెస్ చరిత్రే చెబుతుందని అన్నారు. ఎమర్జెన్సీ కాలం, తెలంగాణ ఉద్యమం వంటి సందర్భాలను ప్రస్తావిస్తూ యువత శక్తిని తక్కువ అంచనా వేయొద్దని రాహుల్ గాంధీకి సూచించారు.
ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, యువత గౌరవం గురించి మాట్లాడే కాంగ్రెస్ నాయకత్వం, తమ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఎందుకు మౌనం వహిస్తోందని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కేవలం ఇంజినీరింగ్ విద్యార్థులనే కాకుండా ఇంజినీరింగ్ అధ్యాపకులను కూడా అవమానించేలా మాట్లాడారని ఆరోపించారు.
తెలంగాణ యువత ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి వరుసగా వ్యాఖ్యలు చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం యువత పట్ల అనుసరిస్తున్న వైఖరిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఇంజినీర్లను, విద్యార్థులను కించపరిచే వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ అధికారికంగా సమర్థిస్తుందా లేదా ఖండిస్తుందా అన్న విషయాన్ని రాహుల్ గాంధీ స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.







