- జొమాటో, స్విగ్గీకి గట్టి పోటీ.
- ఆగస్టు 15 నుంచి బెంగళూరులో పైలట్ సేవలు.
- తక్కువ కమిషన్‌తో రెస్టారెంట్లను ఆకర్షించే వ్యూహం
బెంగళూరు, మహా.
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఆన్‌లైన్ షాపింగ్, క్విక్ కామర్స్ సేవలు అందిస్తున్న సంస్థ, ఆగస్టు 15 నుంచి బెంగళూరులో పైలట్ ప్రాజెక్ట్‌గా ఆహార డెలివరీ సేవలను ప్రారంభించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న జొమాటో, స్విగ్గీలకు ఫ్లిప్‌కార్ట్ రాకతో గట్టి పోటీ ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.
ఫుడ్ డెలివరీ సేవల కోసం ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక మొబైల్ యాప్‌ను తీసుకురానుంది. ప్రస్తుతం బెంగళూరులో రెస్టారెంట్లను భాగస్వాములుగా చేర్చే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. పైలట్ ప్రాజెక్ట్‌కు లభించే స్పందన ఆధారంగా సేవలను హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నైతో పాటు ఇతర ప్రధాన నగరాలకు విస్తరించే ప్రణాళికను సంస్థ రూపొందించినట్లు తెలుస్తోంది.
తక్కువ కమిషన్‌తో కొత్త వ్యూహం
ప్రస్తుతం జొమాటో, స్విగ్గీ సంస్థలు రెస్టారెంట్ల నుంచి సుమారు 16 నుంచి 30 శాతం వరకు కమిషన్ వసూలు చేస్తున్నాయి. అయితే ఫ్లిప్‌కార్ట్ మాత్రం కేవలం 10 శాతం కమిషన్ మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. తక్కువ కమిషన్ ద్వారా ఎక్కువ రెస్టారెంట్లను తమ వేదికపైకి తీసుకురావడమే సంస్థ ప్రధాన వ్యూహంగా భావిస్తున్నారు.
వినియోగదారులకు లాభం.. రెస్టారెంట్లకూ ప్రయోజనం
ఫుడ్ డెలివరీ రంగంలో పోటీ పెరగడంతో వినియోగదారులకు మెరుగైన డిస్కౌంట్లు, తక్కువ డెలివరీ ఛార్జీలు, వేగవంతమైన సేవలు అందే అవకాశం ఉంది. మరోవైపు తక్కువ కమిషన్ కారణంగా రెస్టారెంట్ల లాభదాయకత కూడా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇటీవల రాపిడో కూడా ‘ఓన్లీ’ పేరుతో ఫుడ్ డెలివరీ రంగంలోకి ప్రవేశించగా, ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ఎంట్రీతో భారత ఫుడ్ డెలివరీ మార్కెట్‌లో పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది. జొమాటో, స్విగ్గీ ఆధిపత్యానికి సవాల్ విసురుతూ కొత్త వ్యాపార వ్యూహాలతో ఫ్లిప్‌కార్ట్ ఎంత మేర విజయవంతమవుతుందన్నది ఆసక్తికరంగా మారింది.






