Mahaa Daily Exclusive

  కేకే కన్వెన్షన్ కు… అధికారిక విద్యుత్ కనెక్షన్..?*

Share

  •  ప్రభుత్వ ఖజానాకు కన్నం వేస్తున్న విద్యుత్ శాఖ అధికారులు..
  •  టౌన్ ప్లానింగ్ అనుమతులు లేకుండానే కమర్షియల్ ట్రాన్స్ఫార్మర్..
  •   విద్యుత్ శాఖ అధికారులు పాత్ర పై విచారణకు డిమాండ్..
  • బాధ్యులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి..

మహా ప్రతినిధి కాకినాడ :

శంఖవరం మండలం, అన్నవరం లో

ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, లొసుగులనే పెట్టుబడిగా మార్చుకుని అన్నవరంలో ఒక అక్రమ కే కే కన్వెన్షన్ కమర్షియల్ సామ్రాజ్యం వెలిసింది. నిబంధనల ప్రకారం కనీస అనుమతులు లేని ఒక తాత్కాలిక రేకుల షెడ్డుకు ఏకంగా ‘కమర్షియల్ ఫంక్షన్ హాల్’ అవతారమెత్తించారు. అయితే, ఏ చట్టాలు సామాన్యుడికి చుట్టుకుంటాయో.. అవే చట్టాలు ఇక్కడి నిర్వాహకులకు చుట్టాలుగా మారడం వెనుక పెద్ద కథే ఉందని స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

విద్యుత్ శాఖలోనే ఉంటూ.. నిబంధనలకు పంగనామాలు!

ఈ అక్రమ కమర్షియల్ కళ్యాణ్ మండపం వెనుక సూత్రధారి, పాత్రధారి మరెవరో కాదు.. అదే అన్నవరంలో విధులు నిర్వహిస్తున్న విద్యుత్ శాఖ లైన్మెన్ రాంబాబు అని తెలుస్తోంది. ప్రభుత్వ జీతం తీసుకుంటూ, ప్రభుత్వ సర్వీస్ రూల్స్‌ను బేఖాతరు చేస్తూ.. సదరు ఉద్యోగి ఈ ప్రైవేట్ కమర్షియల్ వ్యాపారంలో కీలక భాగస్వామిగా (Partner) గా వ్యవహరిస్తున్నారు. తనకున్న అధికార బలాన్ని, శాఖలోని లొసుగులను ఉపయోగించుకుని ఈ అక్రమ నిర్మాణానికి తెరవెనుక అన్ని తానే అయి నడిపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రశ్నార్థకంగా మారిన *కమర్షియల్ ట్రాన్స్‌ఫార్మర్’ అనుమతి.

ఇక్కడ అసలు సిసలైన ప్రశ్న ఏమిటంటే.. కనీసం ఫైర్ సేఫ్టీ (అగ్నిమాపక శాఖ) అనుమతి లేని, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ లేని ఒక సాధారణ రేకుల షెడ్డు ఫంక్షన్ హాల్‌కు “కమర్షియల్ ట్రాన్స్‌ఫార్మర్” జగ్గంపేట డిఇ వీరభద్రరావు ఎలా మంజూరు చేశారు? అసలు నిబంధనల ప్రకారం ఉన్నతాధికారులు గ్రౌండ్ వెరిఫికేషన్ చేశారా? లేక లైన్మెన్ రాంబాబు డిపార్ట్‌మెంట్‌లోనే ఉండటంతో ‘కళ్లు మూసుకుని’ పర్మిషన్ ఇచ్చేశారా? ఒక కమర్షియల్ ట్రాన్స్‌ఫార్మర్ పెట్టాలంటే ఎన్నో క్లియరెన్సులు కావాలి, మరి ఇవన్నీ లేకుండానే విద్యుత్ లైన్లు ఎలా లాగారు? రేపు పొరపాటున షార్ట్ సర్క్యూట్ జరిగి వందలాది మంది ప్రాణాలకు ముప్పు వాటిల్లితే బాధ్యులు ఎవరు?

జగ్గంపేట డీఈ వీరభద్రరావు యాక్షన్ తీసుకుంటారా?

సొంత శాఖలోనే ఉంటూ అవినీతికి, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న లైన్మెన్ రాంబాబు వ్యవహారంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగ్గంపేట డివిజనల్ ఇంజనీర్ (DE) వీరభద్రరావు ఈ అక్రమ కమర్షియల్ ట్రాన్స్‌ఫార్మర్ పర్మిషన్లపై తక్షణమే అంతర్గత విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ రూల్స్ ఉల్లంఘించి ప్రైవేట్ కమర్షియల్ కే కే కన్వెన్షన్ కళ్యాణ మండపం వ్యాపారం లో భాగస్వామ్యం నిర్ధారణ అయితే లైన్మెన్ రాంబాబుపై శాఖాపరమైన కఠిన చర్యలు (సస్పెన్షన్) తీసుకోవాలని, ఈ అక్రమ ఫంక్షన్ హాల్‌కు ఇచ్చిన విద్యుత్ కనెక్షన్లను పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉన్నతాధికారుల స్పందన కోసమే ఇప్పుడు అన్నవరం ప్రజలు ఎదురుచూస్తున్నారు.