• భారత్‌కు 8 పసిడి పథకాలు.
గ్లాస్గో, మహా.
కామన్వెల్త్ గేమ్స్–2026లో భారత మహిళా అథ్లెట్లు చరిత్రాత్మక ప్రదర్శనతో దేశ కీర్తిని ప్రపంచ వేదికపై మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. భారత్ సాధించిన 13 స్వర్ణ పతకాలలో ఏకంగా 8 పసిడి పతకాలను మహిళలే ఖాతాలో వేసి భారత విజయగాథకు అసలైన బలంగా నిలిచారు. మొత్తంగా 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో 39 పతకాలు సాధించిన భారత్ పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలవగా, ప్రతి విజయ క్షణంలో భారత మహిళల పట్టుదల, ఆత్మవిశ్వాసం ప్రపంచాన్ని ఆకట్టుకుంది.
గ్లాస్గో వేదికపై వెయిట్‌లిఫ్టింగ్, బాక్సింగ్, జుడో, పారా అథ్లెటిక్స్ వంటి విభిన్న విభాగాల్లో భారత మహిళలు అద్భుత ప్రతిభ కనబరిచారు. వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను మరోసారి తన ఆధిపత్యాన్ని చాటగా, జుడోలో అస్మితా డే స్వర్ణం సొంతం చేసుకుంది. పారా అథ్లెటిక్స్‌లో షర్మిలా దన్ఖడ్ అసాధారణ పోరాటస్ఫూర్తితో బంగారు పతకాన్ని గెలుచుకోగా, బాక్సింగ్‌లో ప్రీతి పవార్, జైస్మిన్ లాంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా ఘంఘాస్, అరుంధతి చౌదరి పసిడి పతకాలతో భారత జెండాను రెపరెపలాడించారు.
ఈ విజయాల వెనుక ఒక్కో అథ్లెట్ది ఒక్కో పోరాటగాథ ఉంది. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, శారీరక సవాళ్లు, సామాజిక విమర్శలు, వ్యక్తిగత కష్టాలను అధిగమిస్తూ వారు అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నారు. రెజ్లింగ్ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ప్రీతి పవార్ బాక్సింగ్‌ను ఎంచుకుని ప్రపంచ వేదికపై విజేతగా నిలిచింది. హర్జిందర్ కౌర్ చిన్ననాటి నుంచి చదువుతో పాటు పొలంలో తండ్రికి సాయం చేస్తూనే క్రీడల్లో రాణించి రజత పతకాన్ని అందుకుంది. గృహహింస, వైకల్యాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న షర్మిలా దన్ఖడ్ 40 ఏళ్ల వయసులో స్వర్ణం సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలిచింది.
మాతృత్వాన్ని బాధ్యతగా, క్రీడను లక్ష్యంగా మలుచుకున్న సీమ కళిరామన్ బిడ్డకు జన్మనిచ్చిన 11 నెలలకే మళ్లీ సాధన ప్రారంభించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు జ్ఞానేశ్వరి యాదవ్ తీవ్రమైన శారీరక ఇబ్బందులను లెక్కచేయకుండా 199 కిలోల బరువు ఎత్తి రజత పతకం సాధించడం ఆమె సంకల్పానికి నిదర్శనంగా నిలిచింది. ఈ విజయాలు కేవలం పతకాల లెక్క మాత్రమే కాకుండా భారత మహిళల ఆత్మస్థైర్యం, కృషి, అంకితభావానికి ప్రతీకగా నిలిచాయి.
ఒకప్పుడు అంతర్జాతీయ క్రీడల్లో భారత మహిళల విజయాలు అరుదుగా కనిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అన్ని క్రీడా విభాగాల్లో మహిళలు తమ ప్రతిభను నిరూపిస్తూ వరుస విజయాలతో భారత క్రీడలకు కొత్త ముఖచిత్రాన్ని అందిస్తున్నారు. కామన్వెల్త్ గేమ్స్–2026లో మహిళలు సాధించిన ఈ ఘన విజయాలు భారత క్రీడా చరిత్రలో మరో స్వర్ణ అధ్యాయంగా నిలిచిపోనున్నాయి. వారి విజయగాథలు భావితరాల క్రీడాకారిణులకు స్ఫూర్తినిస్తూ దేశంలో మహిళా క్రీడల అభివృద్ధికి మరింత ఊపునివ్వనున్నాయి.







