- తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రశ్నలు.
ఢిల్లీ, మహా.
మధురైలోని తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే సంప్రదాయానికి సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ పంచోలీతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు ఈ ఏడాది జనవరిలోనే ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, తమిళనాడు ప్రభుత్వం జూన్‌లో పిటిషన్ దాఖలు చేయడంపై ధర్మాసనం ప్రశ్నలు సంధించింది. ఇంత ఆలస్యంగా సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి గల కారణమేంటని ప్రభుత్వాన్ని నిలదీసింది. అలాగే తిరుప్పరంకుండ్రం కొండపై రాతి స్తంభం వద్ద కార్తీక దీపం వెలిగించే సంప్రదాయం నిజంగానే ఉందా అనే అంశాన్ని కూడా ధర్మాసనం ప్రస్తావించింది.
ఈ వ్యవహారంలో మద్రాస్ హైకోర్టు తీర్పును పూర్తిస్థాయిలో పరిశీలిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేసులోని ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసిన ధర్మాసనం, ఆరు వారాల్లోగా తమ సమాధానాలు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేస్తూ, ప్రస్తుతానికి మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వబోమని వెల్లడించింది. దీంతో తిరుప్పరంకుండ్రం కార్తీక దీపం వివాదంలో మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు యథాతథంగా కొనసాగనున్నాయి.







