Mahaa Daily Exclusive

  జంతర్‌మంతర్‌పై సుప్రీం విచారణ.

Share

• నిరసనలకు ప్రత్యామ్నాయ వేదికపై కేంద్రానికి సూచన.
ఢిల్లీ, మహా.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరుగుతున్న నిరసన ప్రదర్శనలపై సోమవారం సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. నిరసనల నిర్వహణకు జంతర్‌మంతర్ అనువైన ప్రదేశం కాదంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం తెలుసుకోవాలని ధర్మాసనం సూచించింది.

పిటిషనర్ సతీష్ చంద్ కౌశిక్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ, జంతర్‌మంతర్ వద్ద తరచూ జరిగే ధర్నాలు, ఆందోళనల వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిత్యావసర వస్తువుల సరఫరాతో పాటు అంబులెన్స్‌లు, అత్యవసర వైద్య సేవల రాకపోకలకు కూడా ఆటంకం కలుగుతోందని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిరసనలు నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ ప్రదేశాన్ని గుర్తించాలని కోర్టును కోరారు.

పిటిషనర్ వాదనలను పరిశీలించిన సుప్రీంకోర్టు, నిరసనల నిర్వహణ కోసం ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేసే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని సొలిసిటర్ జనరల్‌కు సూచించింది. ప్రజాస్వామ్య హక్కులు, ప్రజల దైనందిన జీవనానికి మధ్య సమతుల్యత పాటించేలా తగిన పరిష్కార మార్గాన్ని పరిశీలించాలని ధర్మాసనం అభిప్రాయపడింది. తదుపరి విచారణలో కేంద్రం స్పందన ఆధారంగా ఈ అంశంపై తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది.