Mahaa Daily Exclusive

  ఫీజు బకాయిలు చెల్లించకపోతే మిలిటెంట్‌ పోరాటం

Share

  • హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కార్యాలయం ముట్టడికి బీసీ విద్యార్థి సంఘం పిలుపు
  • రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఆర్‌.కృష్ణయ్య ఆగ్రహం
  • ఏపీ తరహాలో పూర్తి ఫీజు చెల్లించాలని డిమాండ్‌
  • పూర్తి ఫీజు కోసం ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టీకరణ

హైదరాబాద్, మహా : ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎంపీ ఆర్‌. కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. బకాయిల చెల్లింపులో జాప్యం కొనసాగితే మిలిటెంట్‌ పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. బీసీ విద్యార్థి సంఘం సోమవారం హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల గురించి ప్రశ్నిస్తే తాను ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని, కాబట్టి ఏపీలోనే పోరాటం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం బాధాకరమని ఆర్‌.కృష్ణయ్య విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొంత బకాయి ఉన్నప్పటికీ అక్కడ అమలవుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానం మెరుగ్గా ఉందని అన్నారు. విద్యార్థుల పూర్తి ఫీజును అక్కడ ప్రభుత్వం భరిస్తోందని చెప్పారు. తెలంగాణలో మాత్రం ఇంజినీరింగ్‌ విద్యార్థులకు రూ.35 వేలు, డిగ్రీ విద్యార్థులకు రూ.15 వేలు మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ తరహాలో విద్యార్థుల పూర్తి ఫీజును ప్రభుత్వమే భరించే విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలని ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. బకాయిల విడుదలతో పాటు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.