- విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్ లను ఉపసంహరించుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉంది
- తీవ్రమైన నేర చరిత్ర లేకపోతే కేసులను ఉపసంహరించుకోవచ్చన్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, మహా : కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనల సందర్భంగా విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లపై సోమవారం సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. విద్యార్థులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు ఉపసంహరించుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహన్ లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారణ చేసింది. ‘నేర చరిత్ర’ అనే పదం కేవలం తీవ్రమైన, హేయమైన నేరాలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. అందువల్ల నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులకు గతంలో తీవ్రమైన, హేయమైన నేర చరిత్ర లేనట్లయితే, వారిపై నమోదైన ఎఫ్ఐఆర్లను దిల్లీ సహా ఇతర రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వాలు మూసివేయవచ్చని, లేదా ఉపసంహరించుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
విచారణ ప్రారంభంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపిస్తూ, “నిరసన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులపై ఎఫ్ఐఆర్లను కొనసాగించకూడదనే విషయంలో కేంద్రం పూర్తి నిబద్ధతతో ఉంది. అయితే తీవ్రమైన, హేయమైన నేర చరిత్ర ఉన్న 2,700 మందికిపైగా వ్యక్తులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకునేది లేదు” అని అన్నారు. మరోవైపు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ తన వాదనలు వినిపిస్తూ, నిరసనల సమయంలో న్యాయవాదుల పిల్లలను కూడా పోలీసులు కొట్టారన్నారు. “ఆ వీడియోలు చాలా దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. మేము కోర్టుకు 300 వీడియోలను ఇచ్చాం. ఉన్నతాధికాల నుంచి ఆదేశాలు వచ్చినందున, పోలీస్ కమిషనర్ వీటన్నింటినీ పరిశీలించాలి. విద్యార్థులపై దురాగతాలకు పాల్పడిన యూనిఫామ్ లేని వ్యక్తులను మేము గుర్తించాం. పోలీసులు పెల్లెట్ గన్లు మొదలైనవి ఎందుకు ఉపయోగించారనే దానిపై పోలీస్ కమిషనర్, ఆర్ఏఎఫ్ డైరెక్టర్‌కు ఆదేశాలు ఇవ్వాలి” అని న్యాయవాది గోపాల్ శంకర్నారాయణన్ అన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, కేవలం ఆందోళన జరుగుతుందనే కారణంతో పోలీసుల దురాగతాలను లేదా లాఠీ ఛార్జిని సమర్థించలేమని స్పష్టం చేసింది. శాంతియుత నిరసన తెలిపే హక్కు అందరికీ సంపూర్ణంగా ఉంటుందని నొక్కి చెప్పింది. తదుపరి విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది.







