Mahaa Daily Exclusive

  చైనాలో ‘పేపర్ గోల్డ్’ బ్యాన్… మన మార్కెట్‌పై దీని ప్రభావం ఎంత?

Share

ఇటీవల చైనాలోని ప్రధాన వాణిజ్య బ్యాంకులు, ముఖ్యంగా ‘ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా’ (ఐసిబిసి) లాంటివి, రిటైల్ ‘పేపర్ గోల్డ్’ ట్రేడింగ్‌ను పూర్తిగా నిషేధించడం అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ హఠాత్పరిణామం భారత మార్కెట్‌పై, ముఖ్యంగా డిజిటల్ పసిడిలో పెట్టుబడి పెట్టిన వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, ఇక్కడి పసిడి పెట్టుబడుల తీరుతెన్నులను గమనిస్తే మదుపరులు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని స్పష్టమవుతోంది.

చైనా ఎందుకు నిషేధించిందంటే, భౌతిక రూపంలో కాకుండా కేవలం పత్రాలు లేదా డిజిటల్ రూపంలో బంగారంలో ట్రేడింగ్ చేయడాన్ని ‘పేపర్ గోల్డ్’ అంటారు. చైనాలో దీని వెనుక అసలైన భౌతిక బంగారం ఉండదు. పెట్టుబడిదారులు తక్కువ మార్జిన్ చెల్లించి అప్పు ఆధారంగా భారీ ఎత్తున స్పెక్యులేటివ్ ట్రేడింగ్ అంటే ఊహాజనితమైన ట్రేడింగ్ చేసేవారు. మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు గురైనప్పుడు ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఈ ఆర్థిక ప్రమాదాలను అరికట్టి, పెట్టుబడులను భౌతిక బంగారం వైపు మళ్లించేందుకే చైనా ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

కానీ మన భారత దేశంలో ‘పేపర్ గోల్డ్’ అత్యంత సురక్షితం.. చైనా పరిస్థితికి, మనకూ చాలా వ్యత్యాసం ఉంది. మన దేశంలో ‘పేపర్ గోల్డ్’ అనేది ఒక పారదర్శకమైన, భద్రతతో కూడిన ఆర్థిక సాధనం. సావరిన్ గోల్డ్ బాండ్స్ ద్వారా వీటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేరుగా ప్రభుత్వ హామీతో జారీ చేస్తుంది. కాబట్టి ఇందులో డిఫాల్ట్ అయ్యే ప్రమాదం అస్సలు ఉండదు.

గోల్డ్ ఈటీఎఫ్‌లు పై సెబీ కఠినమైన నిబంధనలు అమలు చేస్తుంది. మ్యూచువల్ ఫండ్ సంస్థలు జారీ చేసే ప్రతి ఈటీఎఫ్ యూనిట్‌కు సమానమైన అసలైన బంగారాన్ని లాకర్లలో భద్రపరచడం ఇక్కడ తప్పనిసరి. చైనాలో మాదిరిగా మన కమోడిటీ మార్కెట్లలో అధిక లీవరేజ్‌తో జూదంలా ట్రేడింగ్ చేయడానికి సెబీ నిబంధనలు అంగీకరించవు.

భారతీయులు క్రమంగా భౌతిక బంగారం నుంచి పేపర్ గోల్డ్ వైపు మళ్లుతున్నారు అనడానికి తాజా గణాంకాలే నిదర్శనం. భౌతిక దిగుమతులను తగ్గించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ లను తీసుకురాగా, 2026 నాటికి వీటి ఔట్ స్టాండింగ్ హోల్డింగ్ 126 టన్నులకు చేరుకుంది. అయితే, అంతర్జాతీయంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకడంతో ప్రభుత్వం చెల్లించాల్సిన భారం రికార్డు స్థాయిలో ₹1.5 లక్షల కోట్లకు చేరింది. ఫలితంగా కొత్త సిరీస్‌ల జారీని ఆర్.బి.ఐ నిలిపివేసింది.

దీంతో ఇన్వెస్టర్లు వేగంగా గోల్డ్ ఈటీఎఫ్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు. 2026 జనవరి నాటికి గోల్డ్ ఈటీఎఫ్‌ల మొత్తం నిర్వహణ ఆస్తులు ₹1.84 లక్షల కోట్లకు చేరాయి. ఒక్క జనవరి నెలలోనే ₹24,040 కోట్ల భారీ పెట్టుబడులు రావడం, ఈటీఎఫ్ మార్కెట్‌లో జపాన్, ఆస్ట్రేలియాలను దాటేసి భారత్ ప్రపంచంలోనే 7వ స్థానానికి ఎగబాకడం మన మార్కెట్ పరిపక్వతను సూచిస్తుంది.

ట్రేడింగ్ పరంగా చైనా నిర్ణయంతో మనకు ఎలాంటి నష్టం లేకపోయినా, పరోక్షంగా స్థూల ఆర్థిక వ్యవస్థపై కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. చైనాలో పేపర్ గోల్డ్ నిషేధం కారణంగా అక్కడి ఇన్వెస్టర్లు భౌతిక బంగారం కొనుగోళ్లకు ఎగబడితే, అంతర్జాతీయంగా పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పసిడి వినియోగదారు అయిన భారత్‌కు ఇది ప్రతికూలాంశం.

కరెంట్ అకౌంట్ లోటు (సి.ఎ.డి) రూపాయిపై ఒత్తిడి
మన దేశంలో పసిడి ఉత్పత్తి దాదాపు శూన్యం. అవసరమైనది అంతా దిగుమతి చేసుకోవాల్సిందే. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దిగుమతుల పరిమాణం 721 టన్నులకు (గత ఏడాదితో పోలిస్తే 4.76%) తగ్గినా, ధరల పెరుగుదల వల్ల దిగుమతి బిల్లు మాత్రం రికార్డు స్థాయిలో $71.98 బిలియన్లకు చేరింది.
బంగారం అనేది ‘నిరుపయోగమైన ఆస్తి’ (డెడ్ అసెట్ ). దీని దిగుమతుల వల్ల దేశంలో ఎలాంటి కొత్త సంపద సృష్టించబడదు, ఉద్యోగాలు రావు. కానీ, వేల కోట్ల రూపాయలను డాలర్లలోకి మార్చి విదేశాలకు చెల్లించడం వల్ల డాలర్‌కు డిమాండ్ పెరిగి భారత రూపాయి విలువ పతనమవుతుంది. ఎగుమతుల కంటే దిగుమతులు పెరిగి కరెంట్ అకౌంట్ లోటు తీవ్రమవుతుంది. రూపాయి విలువ పడిపోతే మనం దిగుమతి చేసుకునే ముడి చమురు లాంటి ఇతర వస్తువుల ధరలు పెరిగి, సామాన్యుడిపై ద్రవ్యోల్బణ భారం పడుతుంది.

చైనాలో పేపర్ గోల్డ్ నిషేధం వల్ల మన దేశంలోని సావరిన్ గోల్డ్ బాండ్స్, గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్, డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టిన వారు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అవి పూర్తిగా భద్రం. అయితే, దేశ ఆర్థిక వ్యవస్థ దృష్ట్యా చూస్తే.. అనవసరమైన భౌతిక బంగారం కొనుగోళ్లను తగ్గించి, సురక్షితమైన ఈటీఎఫ్‌లు, బాండ్ల వైపు మళ్లడమే పెట్టుబడిదారులకు, దేశానికి శ్రేయస్కరం.

(శివ కుమార్ గనివాడ, సీనియర్ అగ్రికల్చర్ అండ్ ట్రేడ్ ఎక్స్‌పర్ట్)