Mahaa Daily Exclusive

  సింగరేణికి మరో భారీ వరం.

Share

• పీకే ఓ సి-2 బ్లాక్‌తో బలోపేతం.
• కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

ఢిల్లీ, మహా.
సింగరేణి సంస్థ భవిష్యత్ అభివృద్ధికి మరో కీలక మైలురాయిగా నిలిచే పీకే ఓసి -2 (ప్రకాశం ఖని ఓపెన్‌కాస్ట్) డిప్‌సైడ్ కోల్ బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషకరమైన పరిణామమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమీపంలోని ఈ బొగ్గు బ్లాక్ సింగరేణికి కేటాయించబడటం సంస్థతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, అధికారులు, తెలంగాణ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.

ఇటీవల ఒడిశాలోని నైని కోల్ బ్లాక్, తాడిచర్ల-2 బ్లాక్‌లు సింగరేణికి దక్కిన అనంతరం, పీకే ఓసి -2 డిప్‌సైడ్ బ్లాక్‌ను కూడా సంస్థకే కేటాయించాలని కార్మిక సంఘాలు, యూనియన్ నాయకులు కోరినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఆ డిమాండ్‌ను కేంద్ర స్థాయిలో ముందుకు తీసుకెళ్లి, తెలంగాణ బిడ్డగా, సింగరేణి అభివృద్ధిని కోరుకునే వ్యక్తిగా ప్రత్యేక చొరవ తీసుకున్న ఫలితంగానే ఈ బ్లాక్ సింగరేణికి దక్కిందని పేర్కొన్నారు. సోమవారం జరిగిన వేలం ప్రక్రియతో ఈ బ్లాక్ సింగరేణికి కేటాయింపు ఖరారైందన్నారు.

పీకే ఓసి-2 డిప్‌సైడ్ బ్లాక్‌లో సుమారు 180 మిలియన్ టన్నుల నాణ్యమైన జి -8 గ్రేడ్ బొగ్గు నిల్వలు ఉన్నాయని, ఏడాదికి 6 మిలియన్ టన్నుల చొప్పున దాదాపు 25 ఏళ్లపాటు ఉత్పత్తి చేపట్టే అవకాశం ఉందని వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 2 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుండగా, సింగరేణికి రూ.42 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందని, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.10,500 కోట్లకు పైగా ఆదాయం లభిస్తుందని తెలిపారు.

నైని, తాడిచర్ల-2, పీకే ఓసి -2 డిప్‌సైడ్ బ్లాక్‌లు కలిపి సింగరేణికి మొత్తం 860 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు అందుబాటులోకి వస్తాయని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ మూడు బ్లాక్‌ల ద్వారా దాదాపు 6,500 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని, సగటున 35 ఏళ్లపాటు ఏడాదికి 22 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయవచ్చని పేర్కొన్నారు. ఈ మూడు గనుల ద్వారా సింగరేణికి రూ.1,95,510 కోట్లకు పైగా ఆదాయం సమకూరనుండగా, రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ.48,780 కోట్ల ఆదాయం లభించే అవకాశం ఉందని వివరించారు.

ఈ మూడు బొగ్గు గనులు సింగరేణికి దక్కడంతో తెలంగాణ ఇంధన భద్రత మరింత బలోపేతం కావడంతో పాటు, విద్యుత్ రంగానికి అవసరమైన బొగ్గు లభ్యత పెరుగుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. సంస్థ ఆర్థికంగా మరింత బలపడటంతో పాటు సింగరేణి కార్మికులకు ఉద్యోగ భద్రత కూడా పెరుగుతుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో వరుసగా మూడు బొగ్గు బ్లాక్‌లు సింగరేణికి దక్కడం తెలంగాణకు శుభపరిణామమని పేర్కొంటూ, మరోసారి సింగరేణి యాజమాన్యం, కార్మికులు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు.