- పండుటాకుల కోసం కదిలొచ్చిన ప్రజానేత
- నేనున్నానంటూ వృద్ధులకు మల్‌రెడ్డి రంగారెడ్డి భరోసా
- వినోభానగర్ మాతాపితరుల సేవాసదనం సందర్శన
ఇబ్రహీంపట్నం మహా:
జీవిత చెరమాంకంలో దూరమై వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న పండుటాకులపై ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి ఆత్మీయ చిరుజల్లు కురిపించారు. జీవిత సంధ్యవేళలో ఆప్యాయత కోసం ఎదురుచూస్తున్న పెద్దలకు భరోసానింపి, మానవత్వానికి మరో అందమైన నిర్వచనంగా నిలిచారు. సోమవారం ఇబ్రహీంపట్నం పర్యటనలో భాగంగా వినోభానగర్ మీదుగా వెళ్తున్న ఎమ్మెల్యే…. మాతాపితరుల సేవసదనం వద్ద ఆగి, ఆశ్రమంలోకి వెళ్లారు. అనుకోకుండా వచ్చిన అతిథి ఎవరని తీక్షణంగా చూస్తున్న వృద్ధుల వద్దకు వెళ్లి, తనను తాను పరిచయం చేసుకున్నారు. ఆప్యాయంగా ఒక్కొక్కరిని పలుకరిస్తూ… వారితో కాసేపు గడిపారు. వారి కష్టసుఖాలు, ఆశ్రమంలో కల్పిస్తున్న సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యస్థితిగతులను అడుగుతూ, ఆశ్రమ సిబ్బందితో మాట్లాడారు. “ఒంటరితనంలో మీ అందరికీ నేనున్నా”నని వృద్ధులకు భరోసా కల్పించారు. సేవాసదనంలో ఉన్న వృద్ధులకు కావాల్సిన దుస్తులు, నిత్యావసర సామగ్రి, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.








