ఎరువుల దారి మళ్లింపుపై విజిలెన్స్ కొరడా.
• రూ.1.34 కోట్ల విలువైన ఎరువుల అక్రమాలు.
• రైతుల యాప్‌లో మార్పులకు కీలక సిఫార్సులు
హైదరాబాద్, మహా.
ఖరీఫ్ సాగు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో రైతులకు ఎరువుల కొరత తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల సరఫరా, పంపిణీ వ్యవస్థపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు నిర్వహించిన తనిఖీల్లో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. ఎనిమిది జిల్లాల్లో నిర్వహించిన సోదాల్లో రూ.1.34 కోట్ల విలువైన ఎరువులు దారి మళ్లించినట్లు గుర్తించారు. రైతుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన ఎరువుల యాప్ పనితీరును కూడా పరిశీలించిన అధికారులు పలు లోపాలను గుర్తించి ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేశారు.
స్టాక్ రిజిస్టర్లను పరిశీలించగా వరంగల్‌లో 17.9 టన్నుల పొటాష్ ఎరువులు దారి మళ్లినట్లు గుర్తించారు. మేడ్చల్ జిల్లాలో 4.75 టన్నుల ఎరువులతో పాటు 71.8 లీటర్ల క్రిమిసంహార మందులను అక్రమంగా నిల్వ ఉంచినట్లు తేలడంతో సంబంధిత డీలర్లపై రెండు 6ఏ కేసులతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేశారు. రామచంద్రాపురం పరిధిలో 14.53 టన్నుల యూరియా మాయమైనట్లు గుర్తించగా, హైదరాబాద్ సిటీ-2 పరిధిలో 2.25 టన్నుల నకిలీ డీఏపీని స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తులపై మూడు కేసులు నమోదు చేశారు.
ఎరువుల పంపిణీ కోసం అమలు చేస్తున్న యాప్‌లో ఉన్న సాంకేతిక లోపాలను కూడా విజిలెన్స్ బృందాలు గుర్తించాయి. ప్రస్తుతం కౌలు రైతులు ఎరువుల బుకింగ్ కోసం భూయజమాని మొబైల్‌కు వచ్చే ఓటీపీపై ఆధారపడాల్సి వస్తుండటంతో ఈ విధానాన్ని కొందరు అక్రమాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఈ సమస్యకు పరిష్కారంగా భూయజమాని అనుమతితో నిర్దిష్ట కాలానికి కౌలు రైతును అధికారిక ఎరువుల గ్రహీతగా నామినేట్ చేసే సౌకర్యాన్ని కల్పించాలని సూచించారు. ఈ-పోస్ యంత్రం ద్వారా బయోమెట్రిక్ ధ్రువీకరణ అనంతరం ఎరువులు అందే విధానాన్ని అమలు చేయాలని సిఫార్సు చేశారు.
అలాగే ఎరువుల యాప్, ఈ-పోస్ యంత్రాల మధ్య సమన్వయం లేకపోవడంతో పంపిణీలో పారదర్శకత దెబ్బతింటోందని అధికారులు గుర్తించారు. ఈ రెండు వ్యవస్థలను ఒకే బ్యాక్‌ఎండ్‌తో రియల్‌టైమ్‌లో అనుసంధానం చేసి, ఎరువుల బుకింగ్, పంపిణీ రెండింటికీ బయోమెట్రిక్ ధ్రువీకరణ తప్పనిసరి చేయాలని సూచించారు.
రైతులు డీలర్లపై ఆధారపడకుండా ఉండేందుకు ప్రస్తుతం ఉన్న యాప్‌తో పాటు ఐవీఆర్‌ఎస్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని విజిలెన్స్ బృందాలు ప్రతిపాదించాయి. డయల్-ఇన్, వాయిస్ గైడెడ్ మెనూ ద్వారా రైతులు స్వయంగా ఎరువులను బుక్ చేసుకునే విధానం అమల్లోకి వస్తే అక్రమాలకు అడ్డుకట్ట పడటంతో పాటు పంపిణీ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు.








