Mahaa Daily Exclusive

  స్మగ్లింగ్ బంగారం పేరుతో భారీ మోసాలు….

Share

స్మగ్లింగ్ బంగారం పేరుతో భారీ మోసాలు.
• రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్ల రూపాయలు కాజేసిన కేటుగాళ్లు.
• అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరిక

హైదరాబాద్, మహా.

తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామంటూ, గోల్డ్ స్కీమ్స్ పేరుతో అమాయకులను నమ్మించి కోట్ల రూపాయలు దోచుకుంటున్న మోసగాళ్ల వ్యవహారాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. జ్యువెలరీ వ్యాపారులు, గృహిణులు, ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని వివిధ రకాల ఎత్తుగడలతో కేటుగాళ్లు భారీగా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన పలు ఘటనలతో బంగారం వ్యాపారంలో మోసాల పరంపర ఆందోళన కలిగిస్తోంది.

పోలీసుల వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జ్యువెలరీ దుకాణాలకు ఆభరణాలు సరఫరా చేస్తున్న ఓ వ్యక్తి గత ఏడాది నుంచి వ్యాపారుల నుంచి ఆర్డర్లు తీసుకుని నగల సరఫరాను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తూ వచ్చాడు. అనుమానం రావడంతో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడకు చెందిన పలువురు వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో అతడు సుమారు రూ.4.5 కోట్ల మేర మోసం చేసి విదేశాలకు పారిపోయినట్లు తేలింది. ఇదే తరహాలో సోమాజిగూడకు చెందిన మరో వ్యాపారి కూడా జ్యువెలరీ షాపుల యజమానుల నుంచి సుమారు రూ.80 కోట్ల మేర మోసానికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది.

మరో ఘటనలో హైదరాబాద్‌కు చెందిన ఓ కేటుగాడు దుబాయ్, శ్రీలంక నుంచి స్మగ్లింగ్ బంగారాన్ని తక్కువ ధరకే తెప్పిస్తానని నమ్మబలికి బాధితుల నుంచి ముందుగానే నగదు వసూలు చేసి పరారయ్యాడు. ఇటీవల సనత్‌నగర్‌కు చెందిన ఓ వ్యాపారి ఈ మోసగాడి మాటలు నమ్మి రూ.2 కోట్లు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరగడాన్ని అవకాశంగా తీసుకుని మోసగాళ్లు కొత్త పంథాలను ఎంచుకుంటున్నారని అధికారులు తెలిపారు. ముఖ్యంగా స్మగ్లింగ్ బంగారం, విదేశాల నుంచి తక్కువ ధరకు బంగారు బిస్కెట్లు, నాణేలు తెప్పిస్తామంటూ పెద్ద ఎత్తున ప్రజలను మోసం చేస్తున్నట్లు వెల్లడించారు. గృహిణులు, ఉద్యోగులు, చిన్న వ్యాపారులు ఈ మోసాలకు ఎక్కువగా బలవుతున్నారని పేర్కొన్నారు.

గోల్డ్ సేవింగ్స్ స్కీమ్స్ పేరుతో కూడా భారీ మోసాలు జరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రతి నెలా కొంత మొత్తం చెల్లిస్తే ఏడాది తర్వాత ఆభరణాలు ఇస్తామని, పెట్టుబడిపై బంగారు నాణేలు అందిస్తామని హామీ ఇచ్చి ప్రజల నుంచి డబ్బులు సేకరించి తర్వాత సంస్థలను మూసివేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు.

వరంగల్‌కు చెందిన ఓ వ్యక్తి ఉప్పల్‌లో సంస్థ ఏర్పాటు చేసి గోల్డ్ స్కీమ్ పేరుతో భారీ లాభాలు వస్తాయని ప్రచారం చేస్తూ వందలాది మందిని మోసం చేసిన కేసు కూడా దర్యాప్తులో ఉందని వెల్లడించారు. అలాగే నగరంలోని ఆభరణాల తయారీ సంస్థల్లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు కార్మికులు బంగారం అపహరించి పరారవుతున్న ఘటనలు కూడా నమోదవుతున్నాయని పోలీసులు తెలిపారు.

ఇలాంటి నేరాల్లో దొంగిలించిన బంగారాన్ని ఎవరికి విక్రయిస్తున్నారో గుర్తించడం దర్యాప్తు సంస్థలకు పెద్ద సవాలుగా మారిందని అధికారులు పేర్కొన్నారు. తక్కువ ధరకే బంగారం, బంగారు బిస్కెట్లు లేదా ఆభరణాలు ఇస్తామని ఎవరైనా ఆశ చూపితే నమ్మవద్దని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంస్థల గురించి వెంటనే డయల్-112 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని నగర డీసీపీ చైతన్యకుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.