హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ కలకలం.
• 52 నకిలీ ఫైర్ ఎన్వోసీలు గుర్తింపు.
• ప్రైవేట్ ఇంటర్ కళాశాలలపై చర్యలకు హైడ్రా సిఫార్సు.
హైదరాబాద్, మహా.
తెలంగాణలో ప్రైవేట్ జూనియర్ కళాశాలల ఫైర్ సేఫ్టీ అనుమతుల వ్యవహారంలో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ నిరభ్యంతర ధ్రువపత్రాలు (ఎన్వోసీలు) సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. ఈ నకిలీ ధ్రువపత్రాల ఆధారంగా పలు ప్రైవేట్ ఇంటర్ కళాశాలలు ఇంటర్మీడియట్ బోర్డుకు అనుమతుల కోసం దరఖాస్తు చేసినట్లు తేలింది. ఈ నేపథ్యంలో సంబంధిత కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని హైడ్రా అధికారులు ఇంటర్ బోర్డుకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.
కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలోని మొత్తం 142 ఫైర్ ఎన్వోసీలను హైడ్రా అధికారులు పరిశీలించగా, వాటిలో 90 ధ్రువపత్రాలు అసలైనవిగా, 52 నకిలీవిగా తేలాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే నెక్లెస్ రోడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది. 2025–26, 2026–27 విద్యా సంవత్సరాలకు సంబంధించి జూనియర్ కళాశాలలు సమర్పించిన అన్ని ఫైర్ ఎన్వోసీలను రికార్డులతో సరిపోల్చి పరిశీలించగా ఈ అక్రమాలు బయటపడ్డాయి.
విచారణలో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో పాటు గతంలో అగ్నిమాపక శాఖలో పనిచేసిన ఓ ఉన్నతాధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ సంతకాలు కూడా ఫోర్జరీ చేసినట్లు తేలింది. ఈ నకిలీ ధ్రువపత్రాల వెనుక సూత్రధారులు, సహకరించిన వ్యక్తులు ఎవరు అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
మొదటి దశలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల డీఐఈవోలు పంపిన 76 ఫైర్ ఎన్‌వోసీల్లో 7 నకిలీవిగా గుర్తించారు. రెండో దశలో పంపిన మరో 66 ధ్రువపత్రాల్లో ఏకంగా 45 నకిలీవిగా తేలడంతో మొత్తం నకిలీ ఎన్వోసీల సంఖ్య 52కు చేరింది. ఈ ధ్రువపత్రాలను సమర్పించిన కళాశాలలపై తక్షణ చర్యలు తీసుకోవాలని హైడ్రా ఇంటర్ బోర్డును కోరింది.
ప్రాథమిక విచారణలో మెహిదీపట్నంలోని ప్రియాంక ఇంటర్మీడియట్ కాలేజీ, విద్యానగర్‌లోని మదర్స్ గర్ల్స్ కాలేజీ, చాంద్రాయణగుట్టలోని శ్రీచంద్ర కాలేజీ, చిక్కడపల్లిలోని న్యూ ఎరా కాలేజీ, శివరాంపల్లిలోని షాహీన్ కాలేజీ, తెల్లాపూర్‌లోని వశిష్ట కాలేజీ, బర్కత్‌పురాలోని హైందవి కాలేజీ, ఎస్ఆర్నగర్లోని రెజోనెన్స్ కాలేజీ సహా పలు విద్యాసంస్థలు ఫోర్జరీ సంతకాలతో కూడిన ఫైర్ ఎన్వోసీలను సమర్పించినట్లు అధికారులు గుర్తించారు.
ఈ వ్యవహారంలో ఇంటర్ బోర్డుకు చెందిన కొందరు అధికారులు కూడా కుమ్మక్కయ్యి ఉండొచ్చనే అనుమానాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.








