Mahaa Daily Exclusive

  ఫైర్ ఎన్‌వోసీల్లో నకిలీ ధ్రువపత్రాల కలకలం….

Share

ఫైర్ ఎన్‌వోసీల్లో నకిలీ ధ్రువపత్రాల కలకలం.
• విద్యార్థులు ఆందోళన చెందొద్దు.
• కఠిన చర్యలు తప్పవు: ఇంటర్ బోర్డు.

హైదరాబాద్, మహా .

రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కళాశాలలకు ఫైర్ ఎన్‌వోసీ తప్పనిసరి చేసిన నేపథ్యంలో నకిలీ ధ్రువపత్రాల వ్యవహారం వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. ఈ అంశంపై ఇంటర్మీడియట్ బోర్డు, హైడ్రా సంయుక్తంగా దర్యాప్తు చేపట్టగా, పలు కళాశాలలు సమర్పించిన ఫైర్ ఎన్‌వోసీల్లో కొన్ని నకిలీవిగా ఉన్నట్లు గుర్తించినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ వెల్లడించారు.
ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించిన ఫైర్ ఎన్‌వోసీలను హైడ్రా వద్ద ఉన్న రికార్డులతో సరిపోల్చి పరిశీలించగా ఈ అక్రమాలు బయటపడినట్లు ఆమె తెలిపారు. హైడ్రాకు అందిన దరఖాస్తుల వివరాలు, బోర్డుకు సమర్పించిన ధ్రువపత్రాల మధ్య వ్యత్యాసాలు ఉండటంతో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం ఈ అంశంపై సమగ్ర విచారణ కొనసాగుతోందని, దర్యాప్తు పూర్తయిన తర్వాత ఎన్ని నకిలీ ధ్రువపత్రాలు సమర్పించబడ్డాయో స్పష్టత వస్తుందని చెప్పారు.
నకిలీ ఫైర్ ఎన్‌వోసీల వ్యవహారాన్ని ఇంటర్మీడియట్ బోర్డు, హైడ్రా అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నాయని అభిలాష అభినవ్ తెలిపారు. ఈ ఘటనపై ఇంటర్మీడియట్ బోర్డు స్థాయిలో అంతర్గత విచారణ కూడా ప్రారంభించినట్లు వెల్లడించారు. నిబంధనలను ఉల్లంఘించిన కళాశాలలపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ వ్యవహారం నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇంటర్మీడియట్ బోర్డు భరోసా ఇచ్చింది. విద్యార్థుల విద్యకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని కార్యదర్శి తెలిపారు. కళాశాలల అనుమతులకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని, తల్లిదండ్రులు అక్కడ వివరాలు పరిశీలించి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని సూచించారు.
ప్రస్తుత విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా మూడు వేలకుపైగా ఇంటర్మీడియట్ కళాశాలలకు అనుమతులు మంజూరైనట్లు ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. అయితే నకిలీ ధ్రువపత్రాల వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరింత కట్టుదిట్టమైన ధ్రువీకరణ వ్యవస్థను అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.