Mahaa Daily Exclusive

  వ్యవసాయ కళాశాల నైరాకు 37 వసంతాల వేడుక….

Share

వ్యవసాయ కళాశాల నైరాకు 37 వసంతాల వేడుక.
* దేశనిర్మాణంలో విశిష్ట సేవలందించిన విద్యాసంస్థ.
* వ్యవసాయ శాస్త్రవేత్తల తయారీకి నైరా చిరునామా.

శ్రీకాకుళం, మహా.

ఉత్తరాంధ్రలో వ్యవసాయ విద్యకు కేంద్రబిందువుగా నిలిచిన నైరా వ్యవసాయ కళాశాల శుక్రవారం 37వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. 1989 ఆగస్టు 7న స్థాపించబడిన ఈ విద్యాసంస్థ మూడు దశాబ్దాలకు పైగా వ్యవసాయ విద్య, పరిశోధన, రైతు సంక్షేమంలో విశేష సేవలందిస్తూ దేశనిర్మాణంలో తనదైన ముద్ర వేసిందని పలువురు పేర్కొన్నారు.

“జ్ఞానాన్ని పెంపొందించడం.. భవిష్యత్తును పండించడం” అనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ కళాశాల, సంప్రదాయ వ్యవసాయ విలువలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మేళవిస్తూ రైతు సమాజానికి ఉపయోగపడే నైపుణ్యవంతులైన వ్యవసాయ శాస్త్రవేత్తలను తీర్చిదిద్దుతోంది. “రూటెడ్ ఇన్ ట్రెడిషన్.. కమిటెడ్ టు ఫార్మర్స్.. షేపింగ్ టుమారో” అనే నినాదంతో రైతు అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోంది.

గత 37 ఏళ్లలో ఈ కళాశాల నుంచి విద్యనభ్యసించిన అనేక మంది శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, అధ్యాపకులు, పరిశోధకులు, రైతు నాయకులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట సేవలు అందిస్తూ దేశ వ్యవసాయ రంగ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నారు. వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు ఈ విద్యాసంస్థ కీలక వేదికగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా కళాశాల కుటుంబ సభ్యులు, విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది, పూర్వ విద్యార్థులకు నిర్వాహకులు శుభాకాంక్షలు తెలిపారు. సమిష్టి కృషి, విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానంతో భారత వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలపాలని ఆకాంక్షించారు.