Mahaa Daily Exclusive

  సాగునీటి ప్రాజెక్టులకు రూ.5 వేల కోట్లు మంజూరు…

Share

సాగునీటి ప్రాజెక్టులకు రూ.5 వేల కోట్లు మంజూరు.
* పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తికి అత్యధిక ప్రాధాన్యం.
* పత్తిపాక, రోళ్లవాగు పనులపై ప్రత్యేక దృష్టి.
* నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి.

హైదరాబాద్‌, మహా.

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణ, పునరావాసం కోసం రూ.5 వేల కోట్ల నిధులు మంజూరు చేసినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. నిధుల కొరతతో సాగునీటి పనులు నిలిచిపోకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. శనివారం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.

మిడ్‌మానేరు ఎడమ కాలువ పనులను వెంటనే పునఃప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్లు ఉత్తమ్‌ తెలిపారు. పత్తిపాక రిజర్వాయర్‌ పనులను ఫాస్ట్‌ట్రాక్‌ విధానంలో పూర్తి చేయాలని సూచించామని చెప్పారు. పత్తిపాక రిజర్వాయర్‌ పూర్తయితే కొత్తగా 10 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు. ఆగస్టు నెలాఖరులోగా పత్తిపాక ప్రాజెక్టు డీపీఆర్‌ను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించినట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో 2.40 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంగా పనులు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. 96 శాతం పనులు పూర్తయిన రోళ్లవాగు ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. రోళ్లవాగు పూర్తయితే చివరి ఆయకట్టులోని 15 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు.

భూసేకరణ, టెండర్లు, అనుమతుల ప్రక్రియలను సమాంతరంగా చేపట్టి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించినట్లు ఉత్తమ్‌ తెలిపారు. నిర్వాసితులకు పరిహారం, పునరావాస కార్యక్రమాలను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. ప్రతి పెండింగ్‌ సమస్యను ‘యాక్షన్‌ పాయింట్‌’గా మార్చి పరిష్కరించాలని, తదుపరి సమీక్షా సమావేశంలో యాక్షన్‌ టేకెన్‌ రిపోర్ట్‌ తప్పనిసరిగా సమర్పించాలని అధికారులకు స్పష్టం చేసినట్లు మంత్రి వెల్లడించారు.