Mahaa Daily Exclusive

  వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తుపై సునీత అసంతృప్తి…

Share

వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తుపై సునీత అసంతృప్తి.
* రాష్ట్రపతి ముర్ముకు లేఖ.
* మనీ ట్రయల్‌, పెద్ద కుట్ర కోణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి.
ఢిల్లీ, మహా

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వివేకా కుమార్తె డాక్టర్‌ సునీతారెడ్డి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు. హత్య జరిగి ఏడేళ్లు దాటినా కేసులోని కీలక ప్రశ్నలకు ఇంకా సమాధానాలు లభించలేదని పేర్కొన్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధం ఇప్పటికీ లభించకపోవడం సహా పలు అంశాలపై సమగ్ర దర్యాప్తు అవసరమని ఆమె కోరారు.

వివేకానందరెడ్డి హత్య వెనుక ఉన్న పెద్ద కుట్ర, కోట్లాది రూపాయల మనీ ట్రయల్‌ కోణాలను పూర్తిగా వెలికితీయాలని రాష్ట్రపతిని సునీతారెడ్డి కోరారు. మరణవార్త అధికారికంగా వెలువడకముందే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఈ విషయం ఎలా తెలిసిందనే అంశంపైనా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని లేఖలో ప్రస్తావించినట్లు తెలిపారు.

సీబీఐ దర్యాప్తు, దాని అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని కేసును ముందుకు తీసుకెళ్లాలని సునీతారెడ్డి విజ్ఞప్తి చేశారు. కేసులో ఇంకా స్పష్టత రాని అంశాలపై విచారణ జరిపించాలని కోరుతూ గతంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయాన్ని కూడా రాష్ట్రపతికి రాసిన లేఖలో ప్రస్తావించారు.

వివేకా హత్య కేసులో దర్యాప్తు పూర్తి స్థాయిలో జరగాలంటే ఆయుధం లభించకపోవడం, ఆర్థిక లావాదేవీలు, హత్య వెనుక ఉన్న కుట్ర, కీలక వ్యక్తులకు సమాచారం చేరిన విధానం వంటి అంశాలపై దృష్టి సారించాలని ఆమె కోరినట్లు తెలుస్తోంది. కేసులోని అన్ని కోణాలను వెలుగులోకి తీసుకువచ్చి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ లేఖ ప్రతులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కూడా సునీతారెడ్డి పంపించారు. ఏడేళ్లు దాటినా కేసులో మిగిలి ఉన్న ప్రశ్నలకు సమాధానాలు లభించకపోవడంపై ఆమె మరోసారి దృష్టి సారించడం రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.