బ్రహ్మం చౌదరిని పరామర్శించిన సీఎం చంద్రబాబు.
• అధైర్యపడొద్దు.. టీడీపీ అండగా ఉంటుంది.
• కుటుంబానికి భరోసా.
అమరావతి, మహా.
కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం పరామర్శించారు. ఇటీవల అస్వస్థతకు గురై చికిత్స అనంతరం తాడేపల్లిలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న బ్రహ్మం చౌదరిని సీఎం స్వయంగా కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
బ్రహ్మం చౌదరి, ఆయన కుటుంబ సభ్యులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. అధైర్యపడవద్దని, టీడీపీ, తాను అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బ్రహ్మం చౌదరి పూర్తిగా కోలుకునే వరకు అవసరమైన వైద్య పర్యవేక్షణ కొనసాగించాలని వైద్యులకు సూచించారు.
జులై 17 అర్ధరాత్రి బ్రహ్మం చౌదరి అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించగా, వైద్య పరీక్షల్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. అనంతరం వైద్యులు చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సహా టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేసి, బ్రహ్మం చౌదరి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును చంద్రబాబు అప్పట్లో ఆదేశించారు. పలువురు పార్టీ నేతలు ఆస్పత్రికి వెళ్లి బ్రహ్మం చౌదరిని పరామర్శించారు. చికిత్స అనంతరం ఆయన ఇంటికి చేరుకోవడంతో సీఎం చంద్రబాబు స్వయంగా వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.







