Mahaa Daily Exclusive

  పోలీసు శాఖలో సమూల సంస్కరణలు…

Share

పోలీసు శాఖలో సమూల సంస్కరణలు.
* తెలంగాణలో మావోయిజం దాదాపు అంతం.
* మాదక ద్రవ్యాల కట్టడమే ఇప్పుడు ప్రధాన సవాల్‌.
* డీజీపీ సీవీ ఆనంద్‌.
వరంగల్‌, మహా.

తెలంగాణ పోలీసు శాఖలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సమూల మార్పులు, సంస్కరణలు చేపడుతున్నామని డీజీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. రాష్ట్రంలో మావోయిజం, నక్సలిజం దాదాపు అంతమైందని, మావోయిస్టు ప్రధాన కేడర్‌ అంతా లొంగిపోయిందని చెప్పారు. కర్రెగుట్టలు సహా కొన్ని ప్రాంతాల్లో మాత్రం మావోయిస్టుల ఉనికి ఉన్నట్లు పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పించడంతోపాటు వారి కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆదివారం వరంగల్‌ జిల్లాలో పర్యటించిన డీజీపీ.. పలు కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడారు.
ములుగులో లొంగిపోయిన మావోయిస్టులతో సోమవారం ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడనున్నట్లు డీజీపీ తెలిపారు. మావోయిస్టు కుటుంబాల సంక్షేమం కోసం పోలీసు శాఖ తరఫున చేయాల్సిన సహాయం చేస్తామని చెప్పారు. తన ఐపీఎస్‌ ప్రస్థానం వరంగల్‌ నుంచే ప్రారంభమైందని గుర్తుచేసుకున్న సీవీ ఆనంద్‌.. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని అన్నారు.
భద్రత తగ్గింపుపై రాజకీయాలు వద్దు
రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలు గణనీయంగా తగ్గడంతో రాజకీయ నాయకులకు కల్పిస్తున్న భద్రతను ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే సమీక్షించామని డీజీపీ తెలిపారు. గన్‌మెన్‌లను పూర్తిగా తొలగించలేదని, అవసరమైన భద్రతను కొనసాగిస్తూనే సంఖ్యను తగ్గించామని స్పష్టం చేశారు. భద్రత తగ్గింపుపై కొందరు రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
భద్రతా కమిటీ సమగ్రంగా పరిశీలించి ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వ్యక్తిగత నిర్ణయాలతో భద్రతను తగ్గించలేదని స్పష్టం చేశారు.
డ్రగ్స్‌పై కొత్త వ్యూహం
ప్రస్తుతం తెలంగాణ పోలీసుల ముందున్న ప్రధాన సవాల్‌ మాదక ద్రవ్యాల నియంత్రణ అని సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు. డ్రగ్స్‌ అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త వ్యూహాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. మారుతున్న నేర పరిస్థితులకు అనుగుణంగా పోలీసు విభాగంలోనూ మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు.
గ్రేహౌండ్స్‌తో పాటు కొన్ని ఇతర పోలీసు విభాగాల పనితీరు, నిర్మాణంలో మార్పులు చేపట్టనున్నట్లు డీజీపీ వెల్లడించారు. మొత్తం పోలీసు శాఖను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సంస్కరించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. అదే సమయంలో పోలీస్‌ స్టేషన్లలో ప్రజలకు అందాల్సిన సాధారణ సేవలు, రోజువారీ విధులు యథావిధిగా కొనసాగుతాయని డీజీపీ సీవీ ఆనంద్‌ స్పష్టం చేశారు.