హైదరాబాద్‌లో 40 లక్షల ఓట్లు గల్లంతు?
* ఎస్ఐఆర్ తుది గణాంకాలపై ఉత్కంఠ.
* సనత్‌నగర్‌లో ఏకంగా 45.68 శాతం ఓట్లపై వేటు!
హైదరాబాద్, మహా.
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ సోమవారంతో ముగియనుండటంతో హైదరాబాద్ నగరంలో ఓటర్ల సంఖ్యపై ఉత్కంఠ నెలకొంది. బీఎల్వోలకు అందిన ఎన్యూమరేషన్ ఫారాల పరిశీలన, డిజిటలైజేషన్ అనంతరం రాజధాని పరిధిలో భారీగా ఓట్లు తగ్గే అవకాశం ఉన్నట్లు ప్రాథమిక గణాంకాలు సూచిస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని 28 నియోజకవర్గాల్లో కలిపి దాదాపు 40 లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగిపోయే అవకాశం ఉందన్న అంచనాలు చర్చకు దారితీశాయి. అయితే తుది ముసాయిదా జాబితా వెలువడిన తర్వాతే అసలు సంఖ్యపై స్పష్టత రానుంది.
ఆదివారం సాయంత్రం వరకు నమోదైన వివరాల ప్రకారం ఈ మూడు జిల్లాల పరిధిలోని 28 నియోజకవర్గాల్లో కలిపి సుమారు 1.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణ, పరిశీలన పూర్తయిన నేపథ్యంలో భారీ సంఖ్యలో పేర్లు తొలగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఆదివారం, సోమవారం ప్రభుత్వ సెలవులు ఉన్నప్పటికీ బీఎల్వోలు, ఉన్నతాధికారులు విధులకు హాజరై ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు.
17న ముసాయిదా జాబితా
ఎన్యూమరేషన్ ఫారాలు ఇంకా సమర్పించని అర్హులైన ఓటర్లు ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు అందించాలని అధికారులు సూచించారు. మరోవైపు ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ జాబితా విడుదలైన తర్వాత తొలగింపులు, చేర్పులు, అభ్యంతరాలు, సవరణలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం రానున్న రెండు రోజుల్లో ఓటర్ల సంఖ్యలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. బోనాల పండుగ నేపథ్యంలో ఫారాల సమర్పణలో భారీగా హెచ్చుతగ్గులు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.
సనత్‌నగర్‌లో దాదాపు సగం ఓట్లకు కోత?
రాజధాని పరిధిలోని నియోజకవర్గాల్లో సనత్‌నగర్ పరిస్థితి ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది. అక్కడ ప్రస్తుతం 2,54,030 మంది ఓటర్లు ఉండగా.. సుమారు 1.16 లక్షల ఓట్లు, అంటే 45.68 శాతం వరకు తొలగిపోయే అవకాశం ఉందని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి.
హైదరాబాద్ జిల్లాలో మలక్‌పేట్‌లో 33.92 శాతం, సనత్‌నగర్‌లో 45.68, ముషీరాబాద్‌లో 39.77, జూబ్లీహిల్స్‌లో 44.21, అంబర్‌పేట్‌లో 36.17, గోషామహల్లో 39.38, ఖైరతాబాద్‌లో 36.78, సికింద్రాబాద్‌లో 38.47 శాతం వరకు ఓట్లు తొలగిపోయే అవకాశం ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. కార్వాన్లో 33.23, చార్మినార్‌లో 32.49, నాంపల్లిలో 31.33, బహదూర్‌పురలో 22.38, కంటోన్మెంట్లో 35.31, యాకుత్‌పురలో 31.40, చాంద్రాయణగుట్టలో 32.57 శాతం వరకు కోత పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
శివారు నియోజకవర్గాల్లోనూ భారీగా..
రంగారెడ్డి జిల్లా పరిధిలో ఇబ్రహీంపట్నంలో 21.43, ఎల్బీనగర్లో 42.19, మహేశ్వరంలో 40.03, రాజేంద్రనగర్‌లో 38.14, శేరిలింగంపల్లిలో 36.60 శాతం వరకు ఓట్లు తొలగిపోయే అవకాశం ఉందని అంచనా. చేవెళ్లలో 19.31, కల్వకుర్తిలో 11.65, షాద్‌నగర్‌లో 14.56 శాతం వరకు కోత పడే అవకాశం ఉన్నట్లు ప్రాథమిక గణాంకాలు సూచిస్తున్నాయి.
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో మేడ్చల్‌లో 29.30, మల్కాజిగిరిలో 37.30, కుత్బుల్లాపూర్‌లో 35.99, కూకట్‌పల్లిలో 32.81, ఉప్పల్‌లో 40.05 శాతం వరకు ఓట్లు తొలగిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే క్యూర్ పరిధిలోని చేవెళ్ల, కల్వకుర్తి, షాద్‌నగర్ నియోజకవర్గాలకు సంబంధించిన గణాంకాలను పరిగణనలోకి తీసుకునే విషయంలో తుది లెక్కల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.
నగరంలో డూప్లికేట్ ఓట్లే కారణమా?
హైదరాబాద్‌కు నిత్యం వేలాది మంది ఉపాధి, విద్య, వ్యాపారం కోసం వలస వస్తుంటారు. కొంతకాలానికి నగరంలో స్థిరపడిన వారు ఇక్కడ కూడా ఓటరు గుర్తింపు పొందుతుంటారు. అదే సమయంలో సొంత గ్రామాల్లోనూ ఓటు కొనసాగించే సందర్భాలు ఉండటంతో డూప్లికేట్ ఓట్ల సమస్య ఏర్పడుతున్నట్లు అధికారులు గుర్తిస్తున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉన్న వారు తమ సొంత ప్రాంతంలోని ఓటును కొనసాగించేందుకు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. దీంతో హైదరాబాద్, శివారు నియోజకవర్గాల్లో కొందరు ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించకపోవడం కూడా ఓట్ల తగ్గుదలకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
అయితే ఫారాలు అందకపోవడమే ఓటు తుది తొలగింపునకు సమానం కాదు. ముసాయిదా జాబితా, అభ్యంతరాలు, సవరణల ప్రక్రియ పూర్తయిన తర్వాతే తుది ఓటర్ల సంఖ్యపై స్పష్టత రానుంది. కొన్ని ప్రాంతాల్లో అధికారుల స్థాయిలో జరిగిన లోపాలపై కూడా పరిశీలన అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆగస్టు 17న విడుదల కానున్న ముసాయిదా జాబితాపై రాజకీయ పార్టీలు, ప్రజల్లో ఆసక్తి నెలకొంది.







