Mahaa Daily Exclusive

  ప్రతి ఇంటా త్రివర్ణం…

Share

ప్రతి ఇంటా త్రివర్ణం.
* ‘హర్‌ ఘర్‌ తిరంగా’లో భాగస్వాములు కండి.
* స్వాతంత్య్ర వేడుకలకు దేశం సిద్ధం.
* ప్రధాని నరేంద్ర మోదీ.
* వందేమాతరం 150 ఏళ్ల సందర్భంగా ఈసారి ప్రత్యేక కార్యక్రమాలు.

ఢిల్లీ, మహా.

భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దేశం సిద్ధమవుతున్న వేళ.. ప్రజలంతా ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిపైనా జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటాలని కోరారు. త్రివర్ణ పతాకం కేవలం దేశ గర్వానికి ప్రతీక మాత్రమే కాదని.. దేశం కోసం మరింత మెరుగ్గా పనిచేయాలనే స్ఫూర్తిని అందిస్తుందని పేర్కొన్నారు. ‘హర్‌ ఘర్‌ తిరంగా-2026’లో చురుగ్గా పాల్గొని వికసిత్‌ భారత్‌ నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామని ప్రజలు సంకల్పించాలన్నారు.
2022లో ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా ప్రారంభమైన ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమం ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోట్లాది మంది స్వచ్ఛందంగా పాల్గొనే జాతీయ ఉద్యమంగా మారింది. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం, త్రివర్ణ పతాకంతో ప్రజల అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడం, దేశభక్తి, జాతీయ సమైక్యతను పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా కేంద్రం పేర్కొంది.
వందేమాతరానికి 150 ఏళ్లు
ఈ ఏడాది ‘హర్‌ ఘర్‌ తిరంగా’ వేడుకలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని ప్రధాని మోదీ తెలిపారు. జాతీయ గేయం ‘వందేమాతరం’ రూపకల్పనకు 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈసారి కార్యక్రమాలను వందేమాతరానికి అంకితం చేయడం గర్వకారణమని పేర్కొన్నారు. ఆగస్టు 6న ప్రారంభమైన ప్రచారంలో భాగంగా ఆగస్టు 9 నుంచి 17 వరకు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
తిరంగా యాత్రలు.. బైక్‌ ర్యాలీలు
ఈసారి ‘హర్‌ ఘర్‌ తిరంగా’ను ప్రజల భాగస్వామ్యంతో మరింత విస్తృతంగా నిర్వహిస్తున్నారు. తిరంగా యాత్రలు, ర్యాలీలు, తిరంగా కచేరీలు, బైక్‌, సైకిల్‌ ర్యాలీలతో పాటు రంగోలి పోటీలు, ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రముఖ ప్రాంతాల్లో త్రివర్ణ పతాక రంగులతో ప్రత్యేక అలంకరణలు, లైటింగ్‌ కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ప్రజలు తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి.. దానితో సెల్ఫీ తీసుకుని ‘హర్‌ ఘర్‌ తిరంగా’ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని అధికారులు కోరుతున్నారు. తద్వారా దేశవ్యాప్తంగా ప్రతి ఇంటినీ త్రివర్ణ పతాకంతో అనుసంధానించాలన్నది కార్యక్రమం లక్ష్యం.
దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన దేశభక్తి
‘హర్‌ ఘర్‌ తిరంగా-2026’లో భాగంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పుదుచ్చేరిలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తిరంగా యాత్రలో పాల్గొన్నారు. ఉత్తరాఖండ్‌ దెహ్రాదూన్‌, జమ్మూకశ్మీర్‌ పుల్వామా, మణిపుర్‌ ఇంఫాల్‌, సిక్కిం గ్యాంగ్‌టక్‌ తదితర ప్రాంతాల్లోనూ భారీ ర్యాలీలు నిర్వహించారు. విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అండమాన్‌–నికోబార్‌ దీవుల రాజధాని శ్రీ విజయపురంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1942 ఆగస్టు 8న మహాత్మా గాంధీ ఇచ్చిన ‘డూ ఆర్‌ డై’ పిలుపు స్వాతంత్య్ర ఉద్యమానికి కొత్త ఊపునిచ్చిందని ఆయన గుర్తుచేశారు. దేశ ప్రయోజనాలు, సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు భారత్‌ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.
త్రివర్ణ పతాకం దేశ గర్వం, ఐక్యతకు ప్రతీక అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ పేర్కొనగా.. ప్రతి ఇంట్లోనే కాకుండా ప్రతి భారతీయుడి హృదయంలోనూ త్రివర్ణం భాగం కావాలని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు పిలుపునిచ్చారు. ‘హర్‌ ఘర్‌ తిరంగా-2026’ను దేశవ్యాప్తంగా దేశభక్తి పండగగా జరుపుకోవాలని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ కోరారు.