• లోక్‌సభలో మూజువాణి ఓటుతో కీలక బిల్లు
ఢిల్లీ, మహా.
విపక్ష సభ్యుల ఆందోళనలు, నినాదాల మధ్య ట్రైబ్యునళ్ల సంస్కరణల బిల్లు–2026కు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది. సభలో చర్చ జరగకుండానే మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించారు. అనంతరం స్పీకర్ లోక్‌సభను మంగళవారానికి వాయిదా వేశారు. ట్రైబ్యునళ్లలో నియామక ప్రక్రియను పారదర్శకంగా మార్చడం, ఖాళీలను త్వరగా భర్తీ చేయడం, పనితీరును పర్యవేక్షించడం, స్వతంత్రత–ఏకరూపతను పెంచడం ఈ బిల్లు ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి.
ట్రైబ్యునళ్ల వ్యవస్థలో కీలక మార్పులకు బిల్లు ప్రతిపాదిస్తోంది. ఇందులో భాగంగా నేషనల్ ట్రైబ్యునల్స్ కమిషన్ ను ఏర్పాటు చేయనున్నారు. దేశంలోని 16 ట్రైబ్యునళ్లు, వాటికి సంబంధించిన అప్పీలేట్ సంస్థల పనితీరు, నియామకాలు, ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలను ఈ కమిషన్ పర్యవేక్షించనుంది. ప్రస్తుతం వేర్వేరు శాఖల పరిధిలో కొనసాగుతున్న ట్రైబ్యునళ్ల వ్యవస్థకు ఒకే విధమైన పరిపాలనా, నియామక విధానాన్ని తీసుకురావడమే లక్ష్యంగా కేంద్రం ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది.
ఐదుగురు సభ్యులతో కమిషన్
నేషనల్ ట్రైబ్యునల్స్ కమిషన్‌లో ఒక ఛైర్‌పర్సన్‌తో పాటు నలుగురు సభ్యులు ఉంటారు. వీరిలో ఇద్దరు న్యాయ రంగానికి చెందినవారు కాగా, మరో ఇద్దరు సాంకేతిక రంగానికి చెందినవారు ఉంటారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లేదా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిని కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నియమించేలా బిల్లులో ప్రతిపాదించారు. ఛైర్పర్సన్ పదవీకాలం ఐదేళ్లు లేదా 70 ఏళ్ల వయసు వరకు ఉంటుంది. సభ్యులకు కూడా ఐదేళ్ల పదవీకాలాన్ని ప్రతిపాదించారు.
సాంకేతిక సభ్యులుగా ప్రజా పరిపాలన, ఆర్థిక వ్యవహారాలు, న్యాయ రంగం, సాంకేతిక పరిజ్ఞానం వంటి విభాగాల్లో కనీసం 25 ఏళ్ల అనుభవం ఉన్న నిపుణులను పరిగణనలోకి తీసుకునేలా నిబంధనలు రూపొందించారు. కమిషన్ ఛైర్పర్సన్, సభ్యులను కేంద్ర ప్రభుత్వం.. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం నియమించే విధానం ప్రతిపాదించారు.
నియామకాల్లో ఏకరూపత
ట్రైబ్యునళ్లలో ఛైర్పర్సన్లు, సభ్యుల నియామకానికి ప్రత్యేక సెర్చ్-కమ్-సెలెక్షన్ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీల్లో కమిషన్ సభ్యులతో పాటు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులు, సీనియర్ ప్రభుత్వ కార్యదర్శులు, సంబంధిత రంగాల నిపుణులకు చోటు కల్పించనున్నారు. నియామక ప్రక్రియలో ఆలస్యం కారణంగా ట్రైబ్యునళ్లలో ఖాళీలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని బిల్లు సూచిస్తోంది.
సెర్చ్-కమ్-సెలెక్షన్ కమిటీలు సిఫారసులు చేసిన అనంతరం కేంద్ర ప్రభుత్వం మూడు నెలల్లో నియామక ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని ప్రతిపాదించారు. దీంతో ట్రైబ్యునళ్లలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఖాళీల సమస్యకు పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
పనితీరుపై కమిషన్ పర్యవేక్షణ
కేవలం నియామకాలకే పరిమితం కాకుండా ట్రైబ్యునళ్ల పనితీరును కూడా నేషనల్ ట్రైబ్యునల్స్ కమిషన్ సమీక్షించనుంది. ఛైర్పర్సన్లు, సభ్యులపై వచ్చే ఫిర్యాదులపై విచారణను పర్యవేక్షించే అధికారం కమిషన్‌కు ఉంటుంది. దుర్వినియోగం, అనర్హత వంటి ఆరోపణలపై చర్యలు తీసుకునే విధానాన్ని కూడా బిల్లులో పొందుపరిచారు.
తీవ్రమైన దుష్ప్రవర్తన లేదా సామర్థ్య లోపం వంటి ఆరోపణలపై తొలగింపు చర్యలకు ముందు సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీ ద్వారా విచారణ జరిపే విధానాన్ని ప్రతిపాదించారు. దీనివల్ల ట్రైబ్యునళ్ల సభ్యులపై చర్యల్లో పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు.
ట్రైబ్యునల్స్ డేటాకు ప్రత్యేక గ్రిడ్
ట్రైబ్యునళ్లకు సంబంధించిన కేసుల సమాచారాన్ని ఒకే చోట అందుబాటులోకి తీసుకురావడానికి నేషనల్ ట్రైబ్యునల్స్ డేటా గ్రిడ్ ఏర్పాటు చేయనున్నారు. వివిధ ట్రైబ్యునళ్లలో నమోదైన కేసులు, వాటి పురోగతి, పరిష్కారానికి పట్టిన సమయం వంటి సమాచారాన్ని డిజిటల్ రూపంలో నిర్వహించేందుకు ఇది ఉపయోగపడనుంది.
కేసుల స్థితిగతులను తెలుసుకోవడంలో న్యాయవాదులు, కక్షిదారులకు సౌలభ్యం కలగడంతో పాటు ట్రైబ్యునళ్ల పనితీరును సమీక్షించేందుకు ప్రభుత్వానికి కూడా ఈ డేటా ఉపయోగపడనుంది.
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో
ట్రైబ్యునళ్ల సంస్కరణలకు సుప్రీంకోర్టు తీర్పులు ప్రధాన కారణంగా నిలిచాయి. ముఖ్యంగా మద్రాస్ బార్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ట్రైబ్యునళ్ల స్వతంత్రత, నియామకాల్లో పారదర్శకత, పదవీకాలం, పరిపాలనా వ్యవహారాలపై సుప్రీంకోర్టు పలు కీలక సూచనలు చేసింది. ట్రైబ్యునళ్లను కార్యనిర్వాహక వ్యవస్థ ప్రభావం నుంచి రక్షించేందుకు స్వతంత్ర జాతీయ స్థాయి కమిషన్ అవసరమని కోర్టు స్పష్టం చేసింది.
2025 నవంబరులో సుప్రీంకోర్టు మరో కీలక తీర్పులోనూ నేషనల్ ట్రైబ్యునల్స్ కమిషన్ ఏర్పాటు చేయడం రాజ్యాంగపరమైన అవసరమని పేర్కొంటూ, ట్రైబ్యునళ్ల నియామకాలు, పరిపాలన, పనితీరులో స్వతంత్రత, పారదర్శకత, ఏకరూపత ఉండాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది.
16 ట్రైబ్యునళ్లకు వర్తింపు
ప్రతిపాదిత చట్టం పరిధిలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్, ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రైబ్యునల్, సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్, డెబ్ట్స్ రికవరీ ట్రైబ్యునళ్లు, నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్, ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్ తదితర సంస్థలు ఉన్నాయి. భవిష్యత్‌లో కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఈ జాబితాలో మార్పులు చేయగలిగేలా నిబంధనను కూడా పొందుపరిచారు. అయితే అలాంటి మార్పులను పార్లమెంట్ ముందుంచాల్సి ఉంటుంది.
ఆందోళనల మధ్య ఆమోదం
మరోవైపు సభలో విపక్ష సభ్యులు పలు అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ నినాదాలు చేయడంతో బిల్లుపై విస్తృత చర్చ జరగలేదు. ఈ పరిస్థితుల్లోనే ప్రభుత్వం బిల్లును ముందుకు తీసుకెళ్లి మూజువాణి ఓటుతో ఆమోదింపజేసింది. దీంతో కీలక సంస్కరణల బిల్లు పార్లమెంటరీ చర్చ లేకుండానే ఆమోదం పొందడంపై రాజకీయంగా చర్చ మొదలైంది.
ట్రైబ్యునళ్లలో ఖాళీల భర్తీ, నియామకాల్లో పారదర్శకత, కార్యనిర్వాహక జోక్యాన్ని తగ్గించడం, కేసుల పరిష్కారంలో సామర్థ్యాన్ని పెంచడం వంటి సమస్యలకు కొత్త వ్యవస్థ పరిష్కారం చూపుతుందని కేంద్రం భావిస్తోంది. మరోవైపు చట్టం అమలులో కమిషన్‌కు ఎంత మేర స్వతంత్రత లభిస్తుంది, కేంద్ర ప్రభుత్వంతో దాని సంబంధాలు ఎలా ఉంటాయి అన్నది కీలకంగా మారనుంది.







