- సేవా ముసుగులో విదేశీ కుట్రల జాలం.
- ఎన్జీవోల అకౌంట్లలోకి వేల కోట్లు.
- టార్గెట్ భారత ప్రగతి చక్రాలే.
- సతత్ సంపద నుంచి ఆక్స్‌ఫామ్ దాకా.
- గుట్టు రట్టు చేస్తున్న దర్యాప్తు సంస్థలు.
- లైసెన్సుల రద్దు, ఖాతాల సీజ్.
- విదేశీ నిధుల మాఫియాపై కేంద్రం ఉక్కుపాదం.
ఢిల్లీ, మహా.
దేశ సరిహద్దుల్లో శత్రువుల చొరబాట్లను అడ్డుకోవడం ఎంత కీలకమో, దేశాంతరం నుంచి అంతర్గత వ్యవస్థల్లోకి నిధుల రూపంలో జరుగుతున్న ఆర్థిక చొరబాట్లను అరికట్టడం కూడా ఇప్పుడు అంతే అత్యవసరంగా మారింది. పర్యావరణ పరిరక్షణ, మానవ హక్కుల పోరాటం, పేదరిక నిర్మూలన, ఉచిత విద్య, సస్టైనబిలిటీ.. వినడానికి ఈ పదాలు ఎంతో పవిత్రంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కానీ, దాతృత్వం అనే ముసుగు ధరించిన ఈ పదాల వెనుక ఒక అంతర్జాతీయ వ్యూహాత్మక కుట్ర దాగి ఉందన్నది ఇప్పుడు అత్యంత దిగ్భ్రాంతికరమైన సత్యం. ప్రజాసేవ పేరుతో విదేశాల నుంచి భారత గడ్డపైకి కుప్పలుతెప్పలుగా పారుతున్న వేల కోట్ల రూపాయల నిధులు నిజంగానే పేదల కడుపు నింపుతున్నాయా? లేక మన దేశ ఆర్థిక, పారిశ్రామిక ప్రగతిని అడ్డుకునేందుకు విదేశీ శక్తులు పన్నుతున్న పక్కా ప్లాన్ ప్రకారం ఇక్కడకు చేరుతున్నాయా? అన్న కోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు వేట మొదలుపెట్టాయి. విదేశీ నిధుల స్వీకరణ చట్టం , ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ నిబంధనల కింద కేంద్ర హోంశాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంయుక్తంగా రంగంలోకి దిగి దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.
వేర్వేరు కాలాల్లో పక్కా ఆధారాలతో కేంద్రం తీసుకుంటున్న చర్యలు బెంబేలెత్తిస్తున్నాయి. ఈ ఫండింగ్ జాలంలో అత్యంత విస్తుపోయే అంశం ఏంటంటే.. విదేశీ నిధులు నేరుగా విరాళాల రూపంలో కాకుండా, చట్టబద్ధమైన ‘వ్యాపార కన్సల్టెన్సీ చార్జీలు’ లేదా ‘ప్రొఫెషనల్ ఫీజు’ల పేర్లతో దర్జాగా ఖాతాల్లోకి జమవుతుండడమే. 2026 జనవరి 6న ‘సతత్ సంపద ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థపై ఈడీ జరిపిన ఆకస్మిక సోదాలు ఈ భారీ కపట నాటకాన్ని బట్టబయలు చేశాయి. ఢిల్లీ, నోయిడా, ఘాజియాబాద్‌లలో విస్తృత తనిఖీలు చేపట్టిన ఈడీ అధికారులు, సుమారు ఆరు కోట్లకు పైగా విదేశీ నిధులు కన్సల్టెన్సీ ముసుగులో వచ్చినట్లు గుర్తించారు. భారతదేశం తన స్వదేశీ ఇంధన అవసరాల కోసం చేపడుతున్న విధానాలను దెబ్బతీసేలా, ‘ఫాసిల్ ఫ్యూయల్ నాన్-ప్రొలిఫరేషన్ ట్రీటీ’ ప్రచారాన్ని వేగవంతం చేసేందుకే ఈ నిధులను వాడారన్నది ప్రాథమిక విచారణలో వెలుగుచూసిన సంచలన వాస్తవం.
పర్యావరణ పరిరక్షణ పేరుతో సాగుతున్న న్యాయపోరాటాల వెనుక కూడా అంతర్జాతీయ మాఫియా పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. పర్యావరణ న్యాయవాది రిత్విక్ దత్తాతో సంబంధమున్న ‘లైఫ్ ట్రస్ట్’ సంస్థకు అమెరికాకు చెందిన ‘ఎర్త్ జస్టిస్’ నుంచి సుమారు 22 కోట్ల రూపాయల మేర విదేశీ నిధులు ప్రొఫెషనల్ ఫీజుల రూపంలో వచ్చినట్లు ఆదాయపన్ను శాఖ నివేదికలు నిగ్గుతేల్చాయి. మన దేశంలో అత్యంత కీలకమైన బొగ్గు, థర్మల్ పవర్ ప్రాజెక్టులపై కోర్టుల్లో వరుస కేసులు వేసి, ప్రాజెక్టులను ఏళ్ల తరబడి జాప్యం చేయడం ద్వారా భారతదేశ విద్యుత్ ఉత్పత్తి రంగాన్ని అంధకారంలోకి నెట్టడమే ఈ నిధుల అసలు లక్ష్యమనే ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పర్యావరణ రంగంలోనే పనిచేసే ‘ఎన్విరానిక్స్ ట్రస్ట్’ ఆగడాలపై దృష్టి సారించిన కేంద్రం 2024లో వారి అనుమతులను రద్దు చేయగా, సదరు సంస్థ ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో న్యాయపోరాటం సాగిస్తోంది. పర్యావరణ పరిరక్షణ పేరు చెప్పి దేశీయ పారిశ్రామిక వృద్ధి చక్రాలను స్తంభింపజేయడమే ఈ నెట్‌వర్క్ అంతిమ వ్యూహంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
కేవలం పర్యావరణ రంగమే కాకుండా, సామాజిక అభివృద్ధి, విద్యా సేవల పేరుతో భారీగా నిధులు సేకరించి ఇతర చీకటి కార్యకలాపాలకు మళ్లించే సంస్థల బండారం కూడా బయటపడుతోంది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఏకంగా 28.6 కోట్ల రూపాయల విదేశీ నిధులను పొందిన ‘ఇండియా రూరల్ ఎవాంజెలికల్ ఫెలోషిప్’ సంస్థ ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ను 2025లో కేంద్ర హోంశాఖ సస్పెండ్ చేసి షాకిచ్చింది. అంతకుముందు సుమారు 42 కోట్లకు పైగా విదేశీ సొమ్మును దిగమింగిన ‘న్యూ హోప్ ఫౌండేషన్’ రిజిస్ట్రేషన్‌ను 2021లోనే రద్దు చేశారు. ఈ విదేశీ నిధుల దారి మళ్లింపు వ్యవహారంలో తెలంగాణ రాష్ట్రం కూడా మినహాయింపు కాదు. తెలంగాణలో పనిచేసిన ‘ఆపరేషన్ మొబిలైజేషన్ ఇండియా’ వ్యవహారంలో విదేశాల నుంచి వచ్చిన నిధులను నేరుగా ఫిక్స్డ్ డిపాజిట్లుగా మార్చి ఇతర అవసరాలకు వాడారన్న పక్కా ఆధారాలతో 2020లో సీఐడీ ఏకంగా 26 బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేయడం దేశవ్యాప్తంగా అప్పట్లో పెను సంచలనం.
మరొకవైపు, దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన రీసెర్చ్ సంస్థలు, థింక్ ట్యాంకులు కూడా ప్రభుత్వ దర్యాప్తు సంస్థల నిఘా నేత్రం నుంచి తప్పించుకోలేకపోయాయి. భారత విధాన రూపకల్పనను, ప్రజాభిప్రాయాన్ని విదేశీ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభావితం చేస్తున్నాయన్న తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో ‘సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్’ , ‘ఆక్స్ ఫామ్ ఇండియా’ వంటి దిగ్గజ సంస్థల ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతులను కేంద్రం నిర్దాక్షిణ్యంగా రద్దు చేసింది. అయితే కేంద్రం చర్యలు కేవలం కక్షసాధింపు కాదు అనడానికి ‘కేర్ ఇండియా’ వ్యవహారమే నిదర్శనం. 2022లో ఐటీ దాడులు ఎదుర్కొన్నప్పటికీ, తమ లెక్కలు పారదర్శకంగా ఉన్నాయని నిరూపించుకోవడంతో 2023లో కేంద్ర హోంశాఖ ఆ సంస్థ లైసెన్స్‌ను మరో ఐదేళ్లకు పొడిగించింది. తప్పు చేయని వారికి భయం అక్కర్లేదని కేంద్రం ఈ చర్య ద్వారా స్పష్టం చేసింది.
మొత్తం మీద 2026 నాటికి కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఆర్‌ఏ చట్టంలోకి తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు ఈ విదేశీ నిధుల మాఫియాకు గొడ్డలిపెట్టులా మారాయి. ఇప్పుడు విదేశాల నుంచి వచ్చే ప్రతీ రూపాయికి మూలం ఎక్కడ, ఏ పేరుతో బ్యాంకుల్లోకి వచ్చింది, చివరకు ఆ డబ్బు ఎవరి కోసం ఖర్చయింది అనే ఈ మూడు ప్రశ్నలే దర్యాప్తు సంస్థలకు బ్రహ్మాస్త్రాలుగా మారాయి. సామాజిక సేవల ముసుగులో విదేశీ నిధులతో స్వదేశీ ప్రగతిని, ఆర్థిక రంగాన్ని అణచివేయాలని చూసే ఏ శక్తినీ ఇక ఉపేక్షించేది లేదని కేంద్రం తన తాజా దాడుల ద్వారా అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేస్తోంది.







