Mahaa Daily Exclusive

  తెలంగాణకు మోదీ సర్కార్ షాక్..! పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా లేదని తేల్చిన కేంద్రం..

Share

  • తెలంగాణకు మోదీ సర్కార్ షాక్
  • పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా లేదని తేల్చిన కేంద్రం
  • ట్రిబ్యునల్ పరిధిలో ఉండటమే కారణమని వెల్లడి
  • రాజ్యసభల రేణుకా చౌదరి ప్రశ్నకు కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ, మహా : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించే ప్రతిపాదన ప్రస్తుతం తమ పరిశీలనలో లేదని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. అంతేకాకుండా.. కృష్ణా జలాల వినియోగం, అంతర్రాష్ట్ర అంశాలు కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II పరిధిలో ఉండటంతో ప్రస్తుత దశలో ప్రాజెక్టుకు టెక్నో ఎకనామిక్ అప్రైజల్ నిర్వహించలేమని వెల్లడించింది. దీంతో ప్రాజెక్టుకు జాతీయ హోదా, కేంద్ర ఆర్థిక సాయం విషయంలో ఇప్పటికిప్పుడు స్పష్టత లేకుండా పోయింది. పార్లమెంట్‌ సమావేశాల్లో కాంగ్రెస్‌ ఎంపీ రేణుకా చౌదరి రాజ్యసభలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌ భూషణ్‌ చౌదరి.. లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జాతీయ ప్రాధాన్యత కలిగిన, అంతర్రాష్ట్ర లేదా అంతర్జాతీయ జల అంశాలతో ముడిపడి ఉన్న, గణనీయమైన సాగునీటి సామర్థ్యాన్ని సృష్టించే భారీ సాగునీటి ప్రాజెక్టులకు నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం జాతీయ ప్రాజెక్టు హోదా పరిశీలిస్తామని కేంద్రం తెలిపింది. అయితే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే ప్రతిపాదన ప్రస్తుతం తమ పరిశీలనలో లేదని స్పష్టం చేసింది.

కృష్ణా జలాల అంశమే ప్రధాన అడ్డంకి

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ (డీపీఆర్) కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కి అందిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ ప్రాజెక్టులో కృష్ణా నదీ జలాల వినియోగంతో పాటు అంతర్రాష్ట్ర అంశాలు ముడిపడి ఉన్నాయని పేర్కొంది. ఈ అంశాలు కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II పరిధిలో ఉన్నందున ప్రస్తుతం న్యాయపరమైన పరిశీలనలో ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టుకు అవసరమైన టెక్నో-ఎకనామిక్ అప్రైజల్‌ను ప్రస్తుత దశలో చేపట్టడం సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది.

డీపీఆర్‌ను వెనక్కి పంపిన కేంద్రం

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఉద్దేశించిన ప్రయోజనాలను సాధించేలా మరింత సమగ్ర ప్రణాళికతో రావాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించినట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు ప్రాజెక్ట్ డీపీఆర్‌ను రాష్ట్రానికి తిరిగి పంపినట్లు వెల్లడించింది. ప్రాజెక్టులో టెక్నికల్ పరిశీలన, ఇతర అవసరమైన అనుమతులు, క్లియరెన్సులు పూర్తయిన తర్వాతే తదుపరి దశల పరిశీలన సాధ్యమవుతుందని కేంద్రం వివరించింది. సాధారణంగా కేంద్ర ఆర్థిక సహాయం కోసం సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించే క్రమంలో కేంద్ర జల సంఘం సాంకేతిక పరిశీలనతో పాటు సంబంధిత టెక్నో-ఎకనామిక్ అప్రైజల్‌ ప్రక్రియలు పూర్తికావాల్సి ఉంటుంది. అయితే కృష్ణా జలాల కేటాయింపులు, అంతర్రాష్ట్ర అంశాలు తేలాల్సి ఉండటంతో ప్రస్తుతం ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదని కేంద్రం పేర్కొంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం నుంచి ఎంత ఆర్థిక సహాయం అందించవచ్చన్న అంశంపై కూడా తుది నిర్ణయం తీసుకోలేదని మోదీ సర్కార్ స్పష్టం చేసింది. ప్రాజెక్టు ద్వారా ఎంత సాగునీటి సామర్థ్యం ఏర్పడుతుంది.. కరువు నివారణకు ఎంత ప్రయోజనం ఉంటుంది.. తాగునీటి అవసరాలకు ఎంత మేర ఉపయోగపడుతుంది వంటి అంశాలపై కూడా కేంద్రం తన సమాధానంలో నిర్దిష్ట మొత్తాలను వెల్లడించలేదు. దీంతో తెలంగాణకు కీలకమైన ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా, కేంద్ర ఆర్థిక సాయం విషయంలో మరింత స్పష్టత రావాలంటే కృష్ణా జలాల అంశాలు, సంబంధిత అనుమతులు, సాంకేతిక-ఆర్థిక పరిశీలన వంటి ప్రక్రియలు ముందుకు సాగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Latest