Mahaa Daily Exclusive

  రాజీవ్ రహదారి బాధితులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలి..! ఖార్ఖానాలో బాధితుల ఆందోళనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సంఘీభావం..

Share

హైదరాబాద్, మహా.

రాజీవ్ రహదారి విస్తరణ ప్రాజెక్టులో భూములు, ఇళ్లు, భవనాలు కోల్పోతున్న బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయమైన పరిహారం అందించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు డిమాండ్ చేశారు. ఖార్ఖానాలో రాజీవ్ రహదారి బాధితులు నిర్వహించిన ఆందోళనలో ఆయన పాల్గొని వారికి బీజేపీ తరఫున సంఘీభావం తెలిపారు.

రోడ్డు విస్తరణ కోసం భూములు, ఇళ్లు, భవనాలు కోల్పోతున్న ప్రజలు అభివృద్ధికి వ్యతిరేకం కాదని రాంచందర్ రావు స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనం కోసం చేపడుతున్న ప్రాజెక్టుకు బాధితులు సహకరిస్తున్నారని, అయితే తమ ఆస్తులను త్యాగం చేస్తున్న వారికి వాటి విలువకు అనుగుణంగా న్యాయమైన పరిహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

తూంకుంట ప్రాంతంలో భూములకు పరిహారం పెంచిన విధంగానే రాజీవ్ రహదారి విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న ఖార్ఖానా ప్రాంత ప్రజలకు కూడా తగిన మేర పరిహారం పెంచాలని కోరారు. తూంకుంటతో పోలిస్తే ఖార్ఖానా మరింత ఖరీదైన పట్టణ ప్రాంతమని, అలాంటి చోట తక్కువ పరిహారం ఇవ్వడం సమంజసం కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తూంకుంటలో ఎంత మేర పరిహారం పెంచిందో, అదే విధంగా ఖార్ఖానా బాధితులకు కూడా సముచిత శాతం మేర పరిహారం పెంచి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజా ప్రయోజనం కోసం తమ భూములు, ఇళ్లు, ఆస్తులను త్యాగం చేస్తున్న బాధితుల త్యాగాన్ని ప్రభుత్వం గుర్తించాలని రాంచందర్ రావు అన్నారు. న్యాయమైన పరిహారం అందించడం ద్వారా వారి పట్ల ప్రభుత్వం న్యాయం చేయాలని సూచించారు. బాధితులు చేస్తున్న న్యాయమైన డిమాండ్‌కు భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతుగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Latest