Mahaa Daily Exclusive

  సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం..! ట్యాంకర్‌ ఢీకొని నుజ్జునుజ్జయిన ఆటో..

Share

  •  ఏడుగురు కూలీలు దుర్మరణం
  •  ట్యాంకర్‌ ఢీకొని నుజ్జునుజ్జయిన ఆటో.
  •  మరో ఐదుగురికి తీవ్ర గాయాలు

సంగారెడ్డి, మహా:

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మొగడంపల్లి మండలం సత్వార్‌ గ్రామ సమీపంలో కూలీలతో వెళ్తున్న ఆటోను వేగంగా వచ్చిన ట్యాంకర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యవసాయ కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు ఆటో నుజ్జునుజ్జయింది.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని చికిత్స కోసం జహీరాబాద్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

పనులు ముగించుకుని స్వగ్రామానికి వెళ్తుండగా..

మృతులంతా కర్ణాటకలోని బీదర్‌ జిల్లా రాజగిరి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలుగా పోలీసులు గుర్తించారు. మొత్తం 14 మంది కూలీలు ప్రతిరోజూ మాదిరిగానే జహీరాబాద్‌ ప్రాంతానికి వ్యవసాయ పనుల కోసం వచ్చారు. పనులు ముగించుకున్న అనంతరం ఆటోలో తమ స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. సత్వార్‌ గ్రామ సమీపంలోకి చేరుకోగానే వేగంగా వచ్చిన ట్యాంకర్‌ ఆటోను ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది.

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఒకేసారి ఏడుగురు మృతి చెందడంతో రాజగిరి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

కోహిర్‌లో మరో ప్రమాదం.. ఇద్దరి మృతి

సంగారెడ్డి జిల్లాలోనే మరో రోడ్డు ప్రమాదం జరిగింది. కోహిర్‌ మండలం కవేలి గ్రామ పరిధిలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన వాహనాలపైకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.

బీదర్‌ నుంచి హైదరాబాద్‌కు కారు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

ఒకే జిల్లాలో వరుస ప్రమాదాలు.. ప్రజల్లో ఆందోళన

సంగారెడ్డి జిల్లాలో ఒకే రోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రహదారులపై వేగ నియంత్రణ, వాహనాల భద్రత, రోడ్డు పక్కన వాహనాల నిలిపివేత వంటి అంశాలపై అధికారులు మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.

Latest