• రూ.40 కోట్లతో 58 ఫైర్‌ఫైటింగ్ వాహనాలు.
• జెండా ఊపి ప్రారంభించిన సీఎం చంద్రబాబు.
అమరావతి, మహా.
ఆంధ్రప్రదేశ్‌లో అగ్నిప్రమాదాలు, విపత్తుల సమయంలో మరింత వేగంగా స్పందించేందుకు అగ్నిమాపక శాఖను ఆధునికీకరిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇందులో భాగంగా రూ.40 కోట్ల వ్యయంతో సమకూర్చిన 58 ఆధునిక అగ్నిమాపక వాహనాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. సీడ్ యాక్సెస్ రోడ్డులో నిర్వహించిన ఫైర్ వెహికల్స్ ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమంలో సీఎం జెండా ఊపి వాహనాలను సేవల్లోకి ప్రవేశపెట్టారు.
గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో సంభవించే అగ్నిప్రమాదాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు 25 అధునాతన ఫైర్‌ఫైటింగ్ వాహనాలను ప్రభుత్వం సమకూర్చుకుంది. భారీ అగ్నిప్రమాదాల సమయంలో మంటలను అదుపు చేసేందుకు నిరంతరాయంగా నీటిని అందించాల్సి ఉండటంతో 20 వాటర్ బౌజర్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితోపాటు ఇరుకైన వీధులు, రద్దీ ప్రాంతాల్లోకి సైతం వేగంగా చేరుకుని సహాయక చర్యలు చేపట్టేందుకు 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైర్‌ఫైటింగ్ వాహనాలను సిద్ధం చేసింది.
కొత్త వాహనాలతో అగ్నిప్రమాదాలు జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవడంతోపాటు మంటలను వేగంగా అదుపులోకి తీసుకురావడానికి వీలవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యంగా గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో సాధారణ ఫైర్ ఇంజిన్లు చేరుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు ఈ వాహనాలు ఉపయోగపడనున్నాయి. భారీ ప్రమాదాల సమయంలో ఎక్కువ మొత్తంలో నీటిని నిరంతరంగా సరఫరా చేయడంలో వాటర్ బౌజర్లు కీలకంగా పనిచేయనున్నాయి.
అగ్నిమాపక శాఖ ఆధునికీకరణలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే తొలి దశలో రూ.33 కోట్ల వ్యయంతో 65 ఫైర్‌ఫైటింగ్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా మరో 58 అధునాతన వాహనాలు అందుబాటులోకి రావడంతో రాష్ట్రంలో అగ్నిమాపక సేవల సామర్థ్యం మరింత పెరగనుంది. కొత్త వాహనాల్లో ఉన్న సాంకేతిక సదుపాయాలు, వాటి పనితీరు, అత్యవసర సమయాల్లో వినియోగించే విధానాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
అగ్నిప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ప్రాణ, ఆస్తి నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు వేగవంతమైన స్పందన వ్యవస్థ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో అగ్నిమాపక శాఖకు ఆధునిక వాహనాలు, పరికరాలను సమకూర్చడంతోపాటు సేవలను మరింత సమర్థంగా అందించే దిశగా చర్యలు చేపడుతోంది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, అగ్నిమాపక శాఖ డీజీ వెంకట రమణతోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నూతన వాహనాల సేవలతో రాష్ట్రంలోని పట్టణాలతోపాటు గ్రామీణ, అటవీ ప్రాంతాల్లోనూ అగ్నిప్రమాదాలపై అగ్నిమాపక శాఖ మరింత వేగంగా స్పందించే అవకాశం ఏర్పడింది.








