Mahaa Daily Exclusive

  పట్నం అభివృద్ధిపై మల్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం!

Share

  • పట్నం అభివృద్ధిపై మల్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం!
  • ప్రభుత్వ భూమి కబ్జాలపై చట్టప్రకారం చర్యలు!
  • వర్షాకాలం దృష్ట్యా ప్రజాసమస్యలపై తొలిప్రాధాన్యం
  • పారిశుద్ధ్యం నుంచి రోడ్ల వరకు అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలి…
  • ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
  • అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం…

 

ఇబ్రహీంపట్నం ఆగస్టు 14 మహా:

ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యమని… క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సూచించారు. తొర్రూర్ లోని క్యాంపు కార్యాలయంలో ఆదిభట్ల సర్కిల్, ఇబ్రహీంపట్నం మున్సిపల్ అధికారులు సత్యనారాయణ రెడ్డి, వై సుదర్శనలతో, ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, ఆక్రమణలు, సంక్షేమ పథకాల అమలు తీరు, పనుల పురోగతిపై అధికారులతో ఆయన ఆరా తీశారు. పట్టణాభివృద్ధిపై ఈ సందర్భంగా మల్ రెడ్డి రంగారెడ్డి దిశానిర్దేశం చేశారు.

 

కాలనీల్లో పారిశుధ్య నిర్వహణ, చెత్త సేకరణను ప్రభుత్వం నిర్దేశించిన రీతిలో మరింత సమర్థవంతంగా చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్న ఆయన… వర్షాకాలం దృష్ట్యా డ్రైనేజీలు, నాలాల పూడికతీతను వేగవంతం చేయాలని చెప్పారు. దెబ్బతిన్న రోడ్లు, గుంతల మరమ్మతులను తక్షణమే పూర్తి చేసి, వీధి దీపాలు పనిచేయని ప్రాంతాల్లో వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ భూమి కబ్జాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలని, అభివృద్ధి పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఆదిభట్ల సర్కిల్ డీసీ సత్యనారాయణరెడ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్ సుదర్శన్, టీపీవోలు, టీపీఎస్ లు, పారిశుద్ధ్య విభాగం ఇన్ స్పెక్టర్ వనజ, వార్డు ఆఫీసర్లు, ఏఈలు, డీఈలు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Latest