Mahaa Daily Exclusive

  ఖర్గే పై వివక్ష చూపడం సిగ్గుచేటు..! హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి..

Share

  • ఖర్గే పై వివక్ష చూపడం సిగ్గుచేటు
  • హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
  • జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ సత్యాగ్రహ నిరసన ర్యాలీ
  • పాల్గొన్న వరంగల్ ఎంపీ, ఎమ్మెల్యేలు

హనుమకొండ, మహా ;

ఇటీవల హల్ద్వానీ లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పట్ల జరిగిన వివక్ష పూరిత, అవమానకర చర్యను హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ఖండించింది. ఏఐసీసీ ఆదేశాల మేరకు శుక్రవారం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అధ్యక్షునికి సంఘీభావం తెలియజేస్తూ, ఈ హేయమైన చర్యకు నిరసనగా నగరంలోని అంబేద్కర్ జంక్షన్ నుండి పబ్లిక్ గార్డెన్ వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు “సత్యాగ్రహం” కార్యక్రమాన్ని చేపట్టారు. సత్యాగ్రహ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కె.ఆర్. నాగరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు అత్యంత విచారకరమైన రోజు అని దేశ ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటైన ఒక ఘటన పై హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున తీవ్ర నిరసన వ్యక్తం చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్న, కోట్ల మంది ప్రజల గొంతుకగా నిలిచిన రాజ్యసభ ప్రతిపక్ష నేత, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పై ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో జరిగిన కుల వివక్ష చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక దళిత బిడ్డ దేశంలో అతిపెద్ద పార్టీకి అధ్యక్షుడిగా ఉండి, బహిరంగ సభలో మాట్లాడితే.. ఆ వేదిక అపవిత్రమైందంటూ గంగాజలంతో ‘శుద్ధీకరణ’ తో పాటు’హవనం’ చేయడం దేనికి సంకేతం? భారత రాజ్యాంగం ప్రకారం అస్పృశ్యత, కుల వివక్ష నేరం. కానీ, బీజేపీ మరియు దాని అనుబంధ సంస్థలు నడుపుతున్న నయా-మనువాద పాలనలో దళితులకు, వెనుకబడిన వర్గాలకు గౌరవం లేకుండా పోతోంది. 21వ శతాబ్దంలో విజ్ఞాన సాంకేతికతతో దూసుకుపోతున్న తరుణంలో, ఇంకా ఇలాంటి మైండ్‌సెట్‌ను ప్రోత్సహించడం సిగ్గుచేటు. ఈ ఘటనపై బాధ్యులైన వారిని తక్షణమే ‘అస్పృశ్యత నిరోధక చట్టం’ కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాము.
అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉన్న దళిత నేత, కాంగ్రెస్ పార్టీ నవ సారథి మల్లికార్జున ఖర్గేపై జరిగిన వివక్షా పూరిత దాడి ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు లాంటిదన్నారు. ఇలాంటి చర్యలు బాధ్యతారాహిత్యానికి, అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. ఖర్గే గారికి దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు అండగా ఉంటారని స్పష్టం చేశారు. ఈ వివక్షకు కారణమైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వరంగల్ మాజీ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ గ్రేన్ మార్కెట్ చైర్మన్ పులి ప్రియాంక, కమలాపూర్ మార్కెట్ చైర్మన్ తౌటం జాన్సి,, యూత్ కాంగ్రెస్ జాతీయ కో-ఆర్డినేటర్ మరియు జనరల్ సెక్రటరీ గొట్టిముక్కల సాగరిక రావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఈ.వి. శ్రీనివాసరావు, ప్రముఖ నాయకులు బత్తిని శ్రీనివాస్ రావు లు హాజరై నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, వివిధ డివిజన్ల మరియు మండలాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల చైర్మన్లు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Latest