Mahaa Daily Exclusive

  ఏపీలో ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ఇక గుడ్‌న్యూస్..! మ్యుటేషన్‌ కష్టాలకు చెక్..

Share

  •  మ్యుటేషన్‌ కష్టాలకు చెక్.
  • రిజిస్ట్రేషన్‌తోనే మున్సిపల్‌ రికార్డుల్లో పేరు మార్పు.
  • మ్యుటేషన్‌ ఫీజు కూడా అప్పుడే చెల్లింపు.

అమరావతి, మహా.

ఆస్తుల కొనుగోలు, విక్రయాల తర్వాత యజమాని పేరు మార్పు కోసం మున్సిపల్‌ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెరదించనుంది. ఆస్తుల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియను మరింత సులభతరం చేసే ఆంధ్రప్రదేశ్‌ పురపాలక శాసనముల మూడో సవరణ బిల్లుకు శాసనసభ సోమవారం ఆమోదం తెలిపింది. మంత్రి నారాయణ బిల్లును సభలో ప్రవేశపెట్టగా.. స్వల్ప చర్చ అనంతరం సభ్యులు ఆమోదించారు.
రిజిస్ట్రేషన్‌ పూర్తయితే.. పేరు కూడా మారినట్టే!
ఇప్పటివరకు ఆస్తి రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తర్వాత మున్సిపల్‌ రికార్డుల్లో యజమాని పేరు మార్చేందుకు ప్రత్యేకంగా మ్యుటేషన్‌ ప్రక్రియను చేపట్టాల్సి వచ్చేది. దీంతో ఆస్తి కొనుగోలుదారులు మరోసారి మున్సిపల్‌ కార్యాలయాలను ఆశ్రయించాల్సి వచ్చేది.
తాజా సవరణతో ఈ విధానంలో కీలక మార్పు రానుంది. ఇకపై ఆస్తి రిజిస్ట్రేషన్‌ జరిగే సమయంలోనే మున్సిపల్‌ రికార్డుల్లో యజమాని పేరు మారేలా రిజిస్ట్రేషన్‌ వ్యవస్థను మున్సిపల్‌ రికార్డులతో అనుసంధానం చేయనున్నారు.
ఒక్కసారి ఫీజు.. రెండు పనులు
రిజిస్ట్రేషన్‌ సమయంలోనే మ్యుటేషన్‌ ఫీజును చెల్లించేలా చట్టంలో మార్పులు చేశారు. దీంతో రిజిస్ట్రేషన్‌ తర్వాత మ్యుటేషన్‌ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయడం, ఫీజు చెల్లించడం వంటి ప్రక్రియలు సులభతరం కానున్నాయి.
అదేవిధంగా కార్పొరేషన్లు, వివిధ స్థాయి మున్సిపాలిటీల్లో వేర్వేరుగా ఉన్న మ్యుటేషన్‌ ఫీజుల స్థానంలో ఏకీకృత ఫీజుల విధానం తీసుకురావడానికి సవరణలు చేశారు.
ఆస్తుల బదలాయింపు మరింత వేగంగా
కొత్త విధానం అమల్లోకి వస్తే ఆస్తి రిజిస్ట్రేషన్‌ నుంచి మున్సిపల్‌ రికార్డుల్లో యజమాని పేరు మార్పు వరకు ప్రక్రియ వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. పౌరులు ఒకే ప్రక్రియలో అవసరమైన పనులను పూర్తి చేసుకునేలా వ్యవస్థను సరళీకరించడమే సవరణల ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది.
మున్సిపల్‌ రికార్డుల్లో యాజమాన్య మార్పులు ఆలస్యం కావడం, మ్యుటేషన్‌ కోసం ప్రత్యేకంగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడం వంటి సమస్యలకు ఈ సవరణలతో పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఆస్తి రిజిస్ట్రేషన్‌ చేసిన వెంటనే యజమాని పేరు మున్సిపల్‌ రికార్డుల్లోనూ మారేలా కొత్త విధానం అమల్లోకి రానుండటంతో ఆస్తి యజమానులకు భారీ ఊరట లభించనుంది.

Latest