Mahaa Daily Exclusive

  రెండో పెళ్లి చేసుకుంటే జీతంలో 20 శాతం కట్‌..!

Share

• మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా మరో పెళ్లి.
• అస్సాం ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం హిమంత బిశ్వ శర్మ వార్నింగ్‌.

గువహటి, మహా.

మొదటి భార్యకు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకునే ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ హెచ్చరించారు. ఇలాంటి ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంతో పాటు.. వారి జీతంలో 20 శాతం మొత్తాన్ని కట్‌ చేసి మొదటి భార్య బ్యాంకు ఖాతాలో జమ చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
గువహటిలోని ఖానాపారా మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు మొదటి భార్యకు చట్టపరంగా విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకోవడం లేదా మరో మహిళతో సహజీవనం చేయడం వంటి ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
విడాకుల కేసు కోర్టులో ఉన్నా.. జీతం నుంచి కోత!
మొదటి భార్యకు విడాకులు ఇచ్చేందుకు సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియ కోర్టులో కొనసాగుతున్నప్పటికీ.. ఆ వ్యవహారం పూర్తయ్యేలోపు మరో పెళ్లి చేసుకున్న ఉద్యోగులపైనా చర్యలు ఉంటాయని హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు.
మొదటి భార్య ప్రభుత్వం వద్ద ఫిర్యాదు లేదా వినతిపత్రం సమర్పిస్తే.. సంబంధిత ఉద్యోగిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. న్యాయపరమైన ప్రక్రియ పూర్తయ్యే వరకు మొదటి భార్యకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే జీతంలో 20 శాతం కోత విధించే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
సర్వీస్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
చట్టాన్ని ఉల్లంఘించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా తమకు వర్తించే సేవా నిబంధనలను అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. ఉద్యోగుల వ్యక్తిగత వ్యవహారాలు సేవా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
మొదటి భార్య హక్కులు, ఆర్థిక భద్రతను కాపాడటంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల్లో నిబంధనల పట్ల బాధ్యతను పెంచే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు.

Latest