Mahaa Daily Exclusive

  పార్టీ మారారు.. మరి ఓటు ఎటు వేశారు..? బీఆర్‌ఎస్‌కు హైకోర్టు సూటి ప్రశ్నలు..!

Share

  • బీఆర్‌ఎస్‌కు హైకోర్టు సూటి ప్రశ్నలు!
  •  ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై కీలక విచారణ.
  •  విప్‌ జారీ చేసినప్పుడు ఎక్కడున్నారు? బిల్లులపై
  • ఎవరి వైపు నిలిచారు?

హైదరాబాద్‌, మహా.

తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ధర్మాసనం పిటిషనర్‌ను పలు కీలక ప్రశ్నలు సంధించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు ఎటువైపు ఓటు వేశారు? విప్‌ జారీ చేసినప్పుడు వారి వైఖరి ఏమిటి? మూజువాణి ఓటులో ఎవరి వైపు నిలిచారు? అంటూ ప్రశ్నించింది.

బీఆర్‌ఎస్‌ తరఫున వాదనలు వినిపిస్తూ.. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్‌ అనంతరం కాంగ్రెస్‌ తరఫున ఎంపీగా పోటీ చేశారని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ ఫిరాయింపునకు సంబంధించిన ఆధారాలను స్పీకర్‌ ట్రైబ్యునల్‌కు సమర్పించినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని వాదించారు.

‘పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్‌ ఏం చేసింది?’

పిటిషనర్‌ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో బీఆర్‌ఎస్‌ స్వయంగా ఎలాంటి చర్యలు తీసుకుందని ప్రశ్నించింది. విప్‌ జారీ చేసిన సమయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు? అసెంబ్లీలో కీలక బిల్లులపై ఓటింగ్‌ జరిగినప్పుడు వారి వైఖరి ఎలా ఉంది? అని ఆరా తీసింది.

అంతేకాకుండా మూజువాణి ఓటు సమయంలోనూ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ వైపు మొగ్గు చూపారో వివరించాలని ధర్మాసనం ప్రశ్నించింది.

‘మేము బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలమే’ అంటున్నారు.. కానీ పార్టీ కార్యక్రమాలకు దూరం!

కోర్టు ప్రశ్నలకు స్పందించిన పిటిషనర్‌.. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తాము ఇప్పటికీ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలమేనని చెప్పుకుంటున్నారని తెలిపారు. అయితే అదే సమయంలో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యక్రమాల్లో మాత్రం పాల్గొనడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో పార్టీ ఫిరాయింపులు, అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రవర్తన, విప్‌ అమలు, ఓటింగ్‌ సమయంలో వారి వైఖరి వంటి అంశాలు ఈ కేసులో కీలకంగా మారాయి. పార్టీ ఫిరాయింపులపై దాఖలైన పిటిషన్‌ విచారణలో హైకోర్టు చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Latest