కారేపల్లి, మహ : ఏజెన్సీ మండలమైన కారేపల్లిలో ప్రజలకు విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని కోరుతూ సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రభుత్వ ప్రజావాణి కార్యక్రమంలో సీపీఐ(ఎం) సింగరేణి మండల కమిటీ ఆధ్వర్యంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. 30 కిలోమీటర్ల పరిధిలో కారేపల్లి మండలం విస్తరించి ఉందని ప్రజలకు సరైన వైద్య సేవలు అందటం లేదని వినతిపత్రంలో తెలిపారు కారేపల్లి పిహెచ్సిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా అప్‌గ్రేడ్ చేసి 50 పడకల ఆసుపత్రి గా మార్చడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు దాంతో ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కె. నరేంద్ర మాట్లాడుతూ..మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 50 పడకల ఆసుపత్రిగా మార్చటంతో పాటు మండలంలోని చీమలపాడు ప్రాంతంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కారేపల్లి పీహెచ్ సీ లో ఖాళీగా ఉన్న మహిళా వైద్యురాలు, ఫార్మసిస్ట్, సూపర్‌వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్, జూనియర్ కళాశాలకు ప్రహరీ గోడ నిర్మించాలని, ప్రభుత్వ పాఠశాలలకు వంట షెడ్లు ఏర్పాటు చేయాలని, ఎస్సీ, బీసీ హాస్టళ్లకు సొంత భవనాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
మాణిక్యారం నుంచి మోట్లగూడెం వరకు మెటల్ వేసి అసంపూర్తిగా ఉన్న బీటీ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని, మండలంలోని అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.
ప్రజావాణిలో వినతిపత్రం ఇచ్చిన వారిలో మండల నాయకులు వజ్జా రామారావు, కొండబోయిన ఉమావతి, యనమనగండ్ల రవి, ముండ్ల ఏకాంబరం, కేసగాని ఉపేందర్, రేగళ్ల మంగయ్య, గంగా ధరణి, ఉపేందర్, భాగ వెంకట అప్పారావు తదితరులు పాల్గొన్నారు.








