ఖమ్మం, మహా.
జాతీయ గేయం ‘వందేమాతరం’ పట్ల కాంగ్రెస్ అగ్రనేతలు వ్యవహరించిన తీరుపై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు వందేమాతరాన్ని అపహాస్యం చేశారని ఆరోపిస్తూ ఖమ్మం నగరంలో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. సోమవారం బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు నేతృత్వంలో నగరంలోని గాంధీ చౌక్ లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఈ నిరసనను ఉధృతంగా నిర్వహించారు. జాతీయ భావాలకు ప్రతీక అయిన గీతాన్ని కించపరిచేలా వ్యవహరించడంపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వందేమాతరం కేవలం ఒక గీతం కాదని, అది ప్రతి భారతీయుడి గుండె చప్పుడని, స్వాతంత్ర్య సంగ్రామంలో ఎందరో వీరులకు స్ఫూర్తినిచ్చిన తారకమంత్రమని బీజేపీ నేతలు ఈ సందర్భంగా గుర్తుచేశారు. అటువంటి పవిత్రమైన గీతాన్ని కాంగ్రెస్ నాయకత్వం అవమానించడం యావత్ దేశ ప్రజలను అవమానించడమేనని వారు మండిపడ్డారు. నిరసనలో భాగంగా గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ అగ్రనేతల దిష్టిబొమ్మను దహనం చేసి తమ తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించారు. అనంతరం బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా, ఎంతో భక్తిశ్రద్ధలతో వందేమాతరాన్ని ఆలపించి తమ దేశభక్తిని చాటుకున్నారు. దశాబ్దాల చరిత్ర కలిగిన ఒక జాతీయ పార్టీకి నాయకత్వం వహిస్తున్న వారు, జాతీయ గేయానికి కనీస గౌరవం ఇవ్వకపోవడం వారి సిద్ధాంతాల లేమికి, దేశభక్తి లోపానికి అద్దం పడుతోందని వారు తీవ్రంగా విమర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను కాంగ్రెస్ పార్టీ మంటగలుపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వందేమాతరాన్ని అగౌరవపరచినందుకు గాను కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు తక్షణమే దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జాతీయ ప్రయోజనాలు, దేశభక్తి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉండాల్సిన కాంగ్రెస్, ఇలా దేశభక్తిని దెబ్బతీసేలా వ్యవహరించడం శోచనీయమన్నారు. వారు బహిరంగ క్షమాపణలు చెప్పని పక్షంలో ఈ ఆందోళనలను జిల్లా వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపాన్ని ఎండగడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వర్లు, నకిరకంటి వీరభద్రం,పమ్మీ అనిత, జిల్లా కోశాధికారి కొనతం లక్ష్మీనారాయణ, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మందా సరస్వతి, అల్లిక అంజయ్య, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు శాసనాల సాయిరాం, కోటమర్తి సుదర్శన్ మారుతినేని వీరభద్ర ప్రసాద్, దొకుపర్తి రవీందర్, దీకొండ శ్యామ్, పిట్టల వెంకట నరసయ్య, మృత్యుంజయ రావు, దేనాకుల వెంకటనారాయణ, అంకిత పాపరావు, పాలెపు రాము, జగిలి రమణ, పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జాతీయవాదులు పాల్గొని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.








