Mahaa Daily Exclusive

  పొంగులేటి సుధాకర్‌రెడ్డికి కీలక బాధ్యతల్లో కొనసాగింపు..!

Share

  •  కర్ణాటక, తమిళనాడు బీజేపీ కో-ఇన్‌చార్జ్‌గా యథావిధిగా కొనసాగింపు.
  •  తదుపరి నియామకాల వరకు ప్రస్తుత బాధ్యతలే.

హైదరాబాద్‌, ఆగస్టు 18:

భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు, కర్ణాటక–తమిళనాడు రాష్ట్రాల కో-ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ పొంగులేటి సుధాకర్‌రెడ్డికి పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతల్లో కొనసాగింపు ఇచ్చింది. తదుపరి ఇన్‌చార్జ్‌ల నియామకం పూర్తయ్యే వరకు ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఇన్‌చార్జ్‌లు, కో-ఇన్‌చార్జ్‌లే తమ బాధ్యతలను నిర్వర్తించాలని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. దీంతో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల కో-ఇన్‌చార్జ్‌గా పొంగులేటి సుధాకర్‌రెడ్డి కొనసాగనున్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పలు రాష్ట్రాలకు సంబంధించి కొత్త సంస్థాగత నియామకాలను ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌ ఇన్‌చార్జ్‌గా జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వినోద్‌ తావ్డేను, కో-ఇన్‌చార్జ్‌గా జాతీయ కార్యదర్శి జగదీశ్‌ ఇశ్వర్‌భాయ్‌ పటేల్‌ను నియమించారు. పంజాబ్‌ ఇన్‌చార్జ్‌గా జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ సతీష్‌ పూనియాను నియమించారు. గుజరాత్‌ ఇన్‌చార్జ్‌గా రాజ్యసభ సభ్యుడు, జాతీయ ప్రధాన కార్యాలయ ఇన్‌చార్జ్‌ తరుణ్‌ చుగ్‌కు బాధ్యతలు అప్పగించారు.

అయితే అన్ని రాష్ట్రాలకు ఒకేసారి కొత్త ఇన్‌చార్జ్‌లను నియమించకుండా, మిగిలిన రాష్ట్రాల్లో ప్రస్తుత ప్రభారీ వ్యవస్థనే కొనసాగించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల కో-ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న పొంగులేటి సుధాకర్‌రెడ్డి బాధ్యతలు కూడా యథావిధిగా కొనసాగనున్నాయి.

తెలంగాణకు చెందిన పొంగులేటి సుధాకర్‌రెడ్డికి దక్షిణ భారతదేశంలో పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా బీజేపీ జాతీయ నాయకత్వం ఆయనపై ఉంచిన నమ్మకాన్ని కొనసాగించినట్లయింది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పార్టీ కార్యక్రమాల సమన్వయం, సంస్థాగత బలోపేతం, జాతీయ నాయకత్వ నిర్ణయాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో ఆయన పాత్ర కొనసాగనుంది. దీంతో పొంగులేటి సుధాకర్‌రెడ్డికి అప్పగించిన కర్ణాటక–తమిళనాడు కో-ఇన్‌చార్జ్‌ బాధ్యతలకు కొనసాగింపు లభించడం తెలంగాణ బీజేపీ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.

Latest