- తనపై అసత్య ఆరోపణలను ఖండించిన గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్
- టిడిపి కార్యాలయంలో రవికుమార్ ప్రెస్ మీట్…
- నిష్పక్షపాత విచారణ కోరిన రవికుమార్ – తప్పు తేలితే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామాకు సిద్ధం
- రాజకీయ ప్రత్యర్థులు కావాలనే తప్పుడు ప్రచారం : చాట్రగడ్డ రవికుమార్ ఆరోపణ
- ఏఎన్ఎం వకుళను ఫోన్‌లో ఎప్పుడూ వేధించలేదు : కాల్ డేటా పరిశీలించాలని డిమాండ్
- పీహెచ్‌సీ సీసీ ఫుటేజీ, సిబ్బంది విచారణతో నిజాలు బయటపడతాయి : రవికుమార్
- నా కాల్ డేటాతో పాటు…. ఫోన్ గూగుల్ టేకోవర్ విచారణకు సిద్ధం….
- 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి సందర్భం ఎదుర్కోలేదు….
- నిష్పక్షక విచారణ చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్న….
- వాస్తవాలు నీగ్గు తేల్చాలని గుడివాడ డిఎస్పికు ఫిర్యాదు చేసిన రవికుమార్….
- సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న అసత్య ప్రచారం, తప్పుడు ఆరోపణలను ఖండిస్తూ గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్ స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని పోలీసులను కోరారు. ఆరోపణలు నిజమని తేలితే మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. రాజకీయ ప్రత్యర్థులు కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని ఆరోపించారు.
గుడివాడ టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి మంగళవారం చాట్రగడ్డ రవికుమార్ మీడియా సమావేశం నిర్వహించారు.
తనపై జరుగుతున్న అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన తెలిపారు. అసలు వాస్తవాలను ప్రజలకు, పార్టీ శ్రేణులకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే మీడియా ముందుకు వచ్చినట్లు చెప్పారు.
ఈ నెల 17న తాను నివసిస్తున్న నందివాడ గ్రామంలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న వకుళ, ఆమె తండ్రి రాజేష్ తనపై పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. తాను ఏఎన్ఎంను మానసికంగా వేధిస్తున్నానంటూ ఫిర్యాదులో ఆరోపించినట్లు తెలిపారు.
తాను ఎప్పుడూ ఆమెకు ఫోన్ చేసి వేధించలేదని రవికుమార్ స్పష్టం చేశారు. ఏడాది కాలానికి సంబంధించిన తన కాల్ డేటాను పరిశీలించినా వాస్తవాలు బయటపడతాయని అన్నారు.
అలాగే తాను ఎప్పుడైనా నందివాడ పీహెచ్‌సీకి వెళ్లానా లేదా అనే విషయాన్ని సాంకేతిక ఆధారాలతో కూడా నిర్ధారించుకోవచ్చని తెలిపారు. పీహెచ్‌సీ పరిధిలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించాలని, అక్కడ పనిచేస్తున్న ఇతర సిబ్బందిని కూడా విచారిస్తే నిజానిజాలు తెలుస్తాయని అన్నారు.
తనపై వచ్చిన ఆరోపణలతో తీవ్రంగా బాధపడుతున్నానని రవికుమార్ తెలిపారు. ఆరోపణలపై పూర్తిస్థాయిలో, నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని పోలీసు అధికారులను కోరారు. తన తప్పు ఉన్నట్లు తేలితే చట్టప్రకారం ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చని స్పష్టం చేశారు.
*ట్రాన్స్‌ఫర్ అంశంపై స్పందించిన రవికుమార్…*
ఈ నెల 14న జరిగిన ఏఎన్ఎం బదిలీకి తానే కారణమనే అపోహతో తనపై ఆరోపణలు చేస్తున్నారని రవికుమార్ పేర్కొన్నారు.
సదరు ఏఎన్ఎం స్వగ్రామం తుమ్మలపల్లి కాగా, అక్కడి నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని నందివాడలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. సొంత మండలంలో విధులు నిర్వహించకూడదనే శాఖాపరమైన నిబంధనలు ఉన్నప్పటికీ, ఆమె ఏడేళ్లుగా అక్కడే పనిచేస్తున్నారని చెప్పారు.
అయితే తాను ఎప్పుడూ ఆ విషయంపై జోక్యం చేసుకోలేదని అన్నారు. సాధారణ బదిలీల్లో భాగంగానే ఈ నెల 14న ఆమెకు ట్రాన్స్‌ఫర్ జరిగిందని, ఆ తర్వాతే తనపై ఆరోపణలు మొదలయ్యాయని పేర్కొన్నారు.
ట్రాన్స్‌ఫర్ ఆర్డర్‌ను మీడియాకు చూపిస్తూ… “14వ తేదీ వరకు నేను మంచి వాడిని… ట్రాన్స్‌ఫర్ జరిగిన తర్వాతే చెడ్డవాడిగా మారిపోయానా?” అని ప్రశ్నించారు.
తన రాజకీయ ప్రత్యర్థులు ఈ వ్యవహారాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని రవికుమార్ ఆరోపించారు. తనపై ఫిర్యాదు చేసిన ఏఎన్ఎం కుటుంబానికి వైసీపీతో రాజకీయ నేపథ్యం ఉందని, వారిని అడ్డుపెట్టుకుని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
తనపై వచ్చిన ఆరోపణల వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని, పోలీసుల విచారణకు సంపూర్ణ సహకారం అందిస్తానని స్పష్టం చేశారు.
నిజంగా తన తప్పు ఉన్నట్లు విచారణలో తేలితే మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు సిద్ధమని రవికుమార్ ప్రకటించారు.
ఇరవై ఏళ్ల తన రాజకీయ జీవితంలో వ్యక్తిగతంగా ఇలాంటి ఆరోపణలు ఎప్పుడూ రాలేదని తెలిపారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి ఆరోపణలు, ప్రచారాలు చేయడం సరైన పద్ధతి కాదని వైసీపీ నాయకులు, ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు సూచించారు.
అదేవిధంగా తన పరువుకు భంగం కలిగించేలా అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరనున్నట్లు చాట్రగడ్డ రవికుమార్ తెలిపారు.
అనంతరం వాస్తవాలు నీగ్గు తేల్చాలని గుడివాడ డిఎస్పి శ్రీనివాస్ కు నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మీడియా సమావేశంలో గుడివాడ, రూరల్, నందివాడ మండలాల టిడిపి అధ్యక్షులు పండ్రాజు సాంబయ్య, వాసే మురళి, దానేటి సన్యాసిరావు, కార్పొరేషన్ డైరెక్టర్ మజ్జాడ నాగరాజు, టిడిపి నాయకులు బొంబాయి శ్రీను, సింగాల రాధాకృష్ణ, రెడ్డి షణ్ముఖ, తదితరులు పాల్గొన్నారు.








