- గాంధీ కుటుంబంపై పూర్తి నమ్మకం ఉంది
- సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం
- స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది
- డిప్యూటీ సీఎంతో భేటీ అనంతరం మీడియాతో కొండా మురళి
హైదరాబాద్, మహా : కాంగ్రెస్ చెలరేగిన కొండా సురేఖ కుమార్తె సుస్మిత కామెంట్స్ దుమారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆమె చేస్తున్న చర్యలు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయని చర్యలు తీసుకోవాలని పీసీసీ నియమించిన క్రమశిక్షణ సంఘం తేల్చింది. పీసీసీ ప్రెసిడెంట్‌కు నివేదిక కూడా ఇచ్చింది. అయితే దీనిపై కీలక నేత భట్టి విక్రమార్కతో కొండా మురళీ చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మరిన్ని వ్యాఖ్యలు చేశారు. ఎలా, ఏం మాట్లాడాతో తన కుమార్తె ఇష్టమని వాటిని ప్రశ్నించే హక్కు తమకు లేదని అన్నారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయన్నారు. తాము మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని అన్నారు. జరుగుతున్న పరిణామాలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి కొండా మురళి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు. సుస్మిత వ్యాఖ్యలు, తర్వాత క్రమశిక్షణ కమిటీ చేసిన సిఫార్సులు అన్నింటిపై మాట్లాడుకున్నారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఏం నిర్ణయం తీసుకున్నారు అనేది మాత్రం తెలియడంలేదు.
సమావేశం నుంచి బయటకు వస్తున్న కొండా మురళిని మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానం ఇస్తూ, తనకు గాంధీ ఫ్యామిలీపై పూర్తినమ్మకం ఉందని అన్నారు. 38 ఏళ్ల సుస్మిత ఏమైనా మాట్లాడే హక్కు ఆమెకు ఉందని అన్నారు. దాన్ని నియంత్రించే హక్కు, ప్రశ్నించే హక్కు తమకు లేదన్నారు. అలాగనే ఆమె తమ కుటుంబ సభ్యురాలు కాకుండా పోదని కామెంట్ చేశారు. ముఖ్యమంత్రిని కలుస్తారా అనే ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా దాట వేశారు. కవిత లాంటి వ్యక్తి బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తే ఎవరైనా ప్రశ్నించారా అని నిలదీశారు. దాదాపు ఐదు నిమిషాలు మీడియాతో మాట్లాడిన కొండా మురళి, తన కుమార్తె వ్యాఖ్యలను ఖండించలేదు. వాటిని పూర్తిగా సమర్థిస్తున్నట్టే మాట్లాడారు. ఇలాంటి రిప్లైనే క్రమశిక్షణ కమిటీకి కొండ సురేఖ అందజేశారు. వాటిని పరిశీలించిన కమిటీ ఆమెపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. దీనికి సంబంధించిన ప్రూఫ్స్‌ను కూడా జత చేసింది. మరోవైపు రేవంత్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి వాటిని ఉపేక్షించవద్దని డిమాండ్ చేస్తున్నారు. పదే పదే ఆమెతోపాటు కుటుంబ సభ్యులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, వీటికి ఫుల్స్టాప్ పెట్టాలంటే కచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని అంటున్నారు.
సురేఖ తప్పించుకొని ఎక్కడికా పారిపోలేదని అన్నారు కొండా మురళి. జిల్లాలోనే తిరుగుతున్నారని చెప్పారు. సుస్మిత వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీకి చెప్పాల్సింది చెప్పామని అన్నారు. తమకు పూర్తి నమ్మకం ఉందని, కచ్చితంగా తనకు అనుకూలమైన నిర్ణయం వస్తుందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం. ఈ మధ్య జరిగిన ప్రెస్మీట్లో పీసీసీ చూసుకుంటుందని చెప్పినప్పటికీ ఆయన మాత్రం సుస్మిత చేసిన వ్యాఖ్యలు, కొండా సురేఖ వైఖరిపై గుర్రుగా ఉన్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయు. పదే పదే తనను టార్గెట్ చేసుకున్న వారికి షాక్ ఇవ్వాలంటే మాత్రం సురేఖ విషయంలో గట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.








