- విద్యాసంస్థల భూములపై కన్నా?
- జీవో 97 వెనుక రియల్ ఎస్టేట్
- ప్రయోజనాలున్నాయన్న బీజేపీ ఆరోపణలు.
- హౌస్ అరెస్టుపై ఎన్.రాంచందర్‌రావు ధ్వజం.
హైదరాబాద్, మహా.
తెలంగాణలో విద్యావ్యవస్థను బలోపేతం చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉన్న విలువైన భూములపై రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు పనిచేస్తున్నాయన్న అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ఆరోపించారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై ఆందోళన చేస్తున్న తమ పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకోవడం, తనను తార్నాకలోని నివాసంలో గృహ నిర్బంధంలో ఉంచడం ప్రజాస్వామ్య హక్కులపై దాడేనని ఆయన మండిపడ్డారు.
రామంతపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులను పరామర్శించేందుకు గురువారం ఉదయం వెళ్లేందుకు సిద్ధమైన రాంచందర్‌రావును పోలీసులు ఆయన నివాసంలోనే అడ్డుకున్నారు. దీంతో అక్కడి నుంచే ఆయన అత్యవసర మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కళ్యాణ్‌నాయక్, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్ కుందే, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవినాయక్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇటీవల నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ‘ఫీజుల బకాయి–బీజేపీ లడాయి’ నిరాహార దీక్షకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారని రాంచందర్‌రావు తెలిపారు. వారిలో రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు కూడా ఉన్నారని చెప్పారు. జీవో 97 కారణంగా తమ భవిష్యత్తుపై ఆందోళన నెలకొందని, కళాశాలకు వచ్చి తమ సమస్యలను పరిశీలించాలని విద్యార్థులు కోరడంతోనే తాను, బీజేపీ యువమోర్చా నాయకులు రామంతపూర్ వెళ్లాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు.
విద్యార్థులను కలవడానికి బయలుదేరిన రాష్ట్ర అధ్యక్షుడిని ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా భారీగా పోలీసులను మోహరించి నిర్బంధించడం ప్రభుత్వ భయాన్ని బయటపెడుతోందని ఆయన విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్ష నాయకులు మాట్లాడకుండా చేయడం, విద్యార్థుల ఆందోళనలకు రాజకీయ మద్దతు లభించకుండా అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం సమస్యను పరిష్కరించలేదని అన్నారు.
40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమా?
బీజేపీ చేపడుతున్న పోరాటం కేవలం రెండు రోజుల నిరాహార దీక్షకో, ఫీజు బకాయిల కోసమో పరిమితం కాదని రాంచందర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణలోని విద్యావ్యవస్థ, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విస్తృత సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రంలోని సుమారు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశంగా దీనిని చూస్తున్నామని తెలిపారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగానికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన విమర్శించారు. గత పదేళ్లలో రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల నియామకాలు, విద్యా మౌలిక వసతుల అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదని ఆరోపించారు. విశ్వవిద్యాలయాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ అమలుపై కూడా రాంచందర్‌రావు ప్రశ్నలు సంధించారు. హామీ ఇచ్చి ఏడాది గడుస్తున్నా నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వ విద్యాసంస్థలకు తగిన నిధులు కేటాయించకుండా ఉన్నత విద్యా ప్రమాణాలను ఎలా పెంచుతారని ప్రశ్నించారు.
పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, పదోన్నతులు, ఆరోగ్య కార్డులు, పదవీ విరమణ అనంతర ప్రయోజనాలు వంటి అంశాలను ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉందని ఆయన అన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోకుండా విద్యా రంగాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని నిలదీశారు.
పాలిటెక్నిక్ కళాశాలలపై తీవ్ర ఆరోపణలు
జీవో 97, పాలిటెక్నిక్ కళాశాలల్లో అమలు చేస్తున్న ‘శక్తి’ విధానం వెనుక ప్రభుత్వం అనుసరిస్తున్న దిశపై రాంచందర్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. సాంకేతిక విద్యను బలహీనపరచడం వల్ల పాలిటెక్నిక్ విద్యార్థులకు భవిష్యత్తులో ఉన్నత విద్యకు వెళ్లే అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
ప్రత్యేకంగా పాలిటెక్నిక్ విద్యార్థులు ఇంజినీరింగ్ విద్యలో ప్రవేశించేందుకు ఉపయోగపడుతున్న ఈసెట్ అవకాశాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఉన్నత విద్యా మార్గాలను మూసివేసే ఏ నిర్ణయాన్నీ తాము అంగీకరించబోమని తెలిపారు.
అదే సమయంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలకు ఉన్న విలువైన భూముల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. మాసాబ్‌ట్యాంక్, రామంతపూర్, మహబూబ్‌నగర్, నల్గొండ తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ విద్యాసంస్థల భూముల విలువ అధికంగా ఉందని, విద్యా వ్యవస్థను బలహీనపరిచే నిర్ణయాల వెనుక భూములపై ప్రయోజనాలు ఉన్నాయన్న అనుమానాలకు తావివ్వకూడదని అన్నారు.
విద్యాసంస్థల భూములను ఏ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారో ప్రభుత్వం ప్రజలకు స్పష్టంగా వెల్లడించాలని కోరారు. విద్యాసంస్థల ఆస్తులు విద్యా అవసరాలకే ఉపయోగపడాలని, వాటిని వాణిజ్య ప్రయోజనాలకు మళ్లించే ప్రయత్నాలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.
కంటితుడుపు కమిటీలు వద్దు
జీవో 97పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు సమస్యను పరిష్కరించేందుకు కాకుండా కాలయాపన చేసేందుకు ఉపయోగపడుతున్నాయని రాంచందర్‌రావు విమర్శించారు. విద్యార్థుల్లో ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు.
విద్యార్థులు, అధ్యాపకులు, విద్యా నిపుణులతో చర్చించి జీవో 97పై తుది నిర్ణయం తీసుకోవాలని, అప్పటివరకు విద్యార్థుల ఉన్నత విద్యా అవకాశాలకు ఎలాంటి నష్టం జరగదని స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాహుల్‌గాంధీకి సవాల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై కూడా రాంచందర్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో విద్యార్థుల సమస్యలపై మాట్లాడుతున్న రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
విద్యార్థుల సమస్యలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని సవాల్ చేశారు. ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీల అమలుపైనా కాంగ్రెస్ అధిష్ఠానం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు.
పోరాటం ఆగదన్న బీజేపీ
విద్యార్థులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం తమ ఉద్దేశం కాదని రాంచందర్‌రావు పేర్కొన్నారు. విద్యార్థుల న్యాయమైన హక్కులకు అండగా నిలవడమే తమ లక్ష్యమన్నారు. “విద్యార్థుల శక్తే దేశ శక్తి” అనే భావనతో బీజేపీ విద్యార్థుల సమస్యలపై పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని తెలంగాణలో సమర్థంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యా రంగంలో నాణ్యత, నైపుణ్యం, పరిశోధన, ఉపాధి అవకాశాలను పెంచే విధంగా విధానాలను రూపొందించాలని సూచించారు.
తనపై గృహ నిర్బంధం, అరెస్టులు, కేసులు, అవసరమైతే నిర్బంధ చట్టాలు ప్రయోగించినా విద్యార్థుల హక్కుల కోసం తమ పోరాటం ఆగదని రాంచందర్‌రావు స్పష్టం చేశారు. పోలీసుల ఆంక్షలు తొలగిన వెంటనే రామంతపూర్ పాలిటెక్నిక్ విద్యార్థులను కలసి వారి సమస్యలను తెలుసుకుంటామని తెలిపారు.








