Mahaa Daily Exclusive

  రేవంత్‌ సర్కార్‌ వెయ్యి రోజుల ‘రైజింగ్‌’..! తెలంగాణకు కొత్త దిశ..! తెలంగాణను ట్రిలియన్‌ డాలర్‌ ఆర్థిక శక్తిగా మార్చే మహా ప్రణాళిక..!

Share

  •   రైతు నుంచి ఫ్యూచర్‌ సిటీ వరకు..
  • సంక్షేమం ఓ వైపు.. అభివృద్ధి మరో వైపు.
  •  కొలువులు.. సంక్షేమం.. పెట్టుబడులు.. సంస్కరణలు.
  •  వెయ్యి రోజుల పాలన.. 2047 లక్ష్యం.
  •  తెలంగాణను ట్రిలియన్‌ డాలర్‌ ఆర్థిక శక్తిగా మార్చే మహా ప్రణాళిక!

హైదరాబాద్, మహా.

తెలంగాణలో సరికొత్త శకానికి నాంది పలికిన ‘ప్రజా ప్రభుత్వం’ వెయ్యి రోజుల సువర్ణ మైలురాయిని చేరుకుంది. ఒకవైపు సంక్షేమ పథకాలతో పేదల కన్నీళ్లు తుడుస్తూనే, మరొకవైపు రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి అభివృద్ధి దిశగా ఉరకలెత్తిస్తున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి దార్శనికతకు ఈ వెయ్యి రోజుల పాలన సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. రైతు సంక్షేమం నుంచి మహిళా సాధికారత వరకు, విద్య, వైద్యం, సామాజిక న్యాయం నుంచి డిజిటల్ పాలన, పెట్టుబడులు, మౌలిక వసతుల దాకా.. ప్రభుత్వం చేపట్టిన ప్రతి అడుగు రాష్ట్ర భవిష్యత్ ముఖచిత్రాన్ని మార్చేస్తోంది**.

రైతు కంట కన్నీరు చూడకూడదన్న దృఢ సంకల్పంతో అడుగులేసిన రేవంత్ సర్కార్ వ్యవసాయ రంగాన్ని పండుగలా మార్చింది. ఒకే దెబ్బతో రెండు లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీ చేసి 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు కొండంత అండగా నిలిచింది. రైతు భరోసా కింద ఏకంగా రూ.36 వేల కోట్లకు పైగా పెట్టుబడి సాయం అందించడమే కాకుండా, సన్నవడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ అమలు చేసి ముమ్మాటికీ ఇది రైతు పక్షపాతి ప్రభుత్వమేనని నిరూపించింది. ఉచిత విద్యుత్తు, రైతు బీమా, పంట నష్టపరిహారం వంటి పథకాలను నిరంతరాయంగా కొనసాగిస్తూ, వ్యవసాయం కోసమే దాదాపు రూ.1.68 లక్షల కోట్లు ఖర్చు చేయడం చారిత్రాత్మకం. ధాన్యం కొనుగోళ్లలోనూ రికార్డులు బద్దలుకొడుతూ, గత యాసంగిలో 8,575 కేంద్రాల ద్వారా 81.12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొని రూ.18,929 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. రెండు సీజన్లలో కలిపి 1.47 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి రూ.35,077 కోట్లు చెల్లించడంతో పాటు, తెలంగాణ బియ్యానికి అంతర్జాతీయ బ్రాండింగ్ కల్పిస్తూ ఫిలిప్పీన్స్‌కు 8 లక్షల మెట్రిక్ టన్నుల ఎగుమతికి ఒప్పందం కుదుర్చుకోవడం సీఎం అపార దార్శనికతకు నిదర్శనం.
మహిళా సాధికారత, పేద కుటుంబాల సంక్షేమం రేవంత్ ప్రభుత్వంలో అత్యున్నత శిఖరాలను తాకాయి. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు కల్పించిన ఉచిత ప్రయాణంతో ఇప్పటివరకు 335 కోట్లకు పైగా ప్రయాణాలు జరగడం ఒక సంచలనం. గృహజ్యోతి కింద 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తూ 10 కోట్లకు పైగా జీరో బిల్లులు జారీ చేయడంతో పాటు, 43 లక్షల కుటుంబాలకు కేవలం రూ.500 కే వంటగ్యాస్ అందించి సామాన్యుల పాలిట సంజీవనిలా నిలిచింది. కల్యాణలక్ష్మి ద్వారా 1.68 లక్షల మంది ఆడబిడ్డలకు రూ.4,709 కోట్ల ఆర్థిక భరోసా, 4.54 లక్షల మహిళా సంఘాలకు రూ.60,487 కోట్ల బ్యాంకు లింకేజీ కల్పించి వారిని ఆర్థిక శక్తిగా మారుస్తోంది. యూనిఫాంల తయారీ, పెట్రోల్ బంకుల నిర్వహణ వంటి కొత్త ఆదాయ మార్గాలు వారికి అప్పగిస్తోంది. 15 లక్షల కొత్త రేషన్ కార్డులతో 3.38 కోట్ల మందికి ఆహార భద్రత కల్పించడంతో పాటు, తొలి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టి ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందిస్తోంది. 43.01 లక్షల మందికి సామాజిక భద్రతా పింఛన్ల కింద రూ.30 వేల కోట్లకు పైగా వ్యయం చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుతోంది.
సామాజిక న్యాయం కేవలం ఎన్నికల నినాదంగా కాకుండా ఆచరణలో చూపిస్తూ, 1.12 కోట్ల కుటుంబాలను కవర్ చేస్తూ దేశంలోనే తొలిసారిగా సమగ్ర కుల సర్వేను పూర్తి చేసింది. సుప్రీంకోర్టు తీర్పు రాగానే 59 ఎస్సీ ఉపకులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించి, అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును శాసనసభలో ఆమోదించి కేంద్రానికి పంపడం బీసీల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. 12 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కనీస వేతనాల సవరణతో కోటి 11 లక్షల మంది కార్మికులకు లబ్ధి చేకూర్చడంతో పాటు, గిగ్ కార్మికుల కోసం ప్రత్యేక చట్టం, సంక్షేమ బోర్డు తెచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిదే. విద్యా, ఉద్యోగ రంగాల్లోనూ దూసుకుపోతూ, మెగా డీఎస్సీ ద్వారా 10,006 ఉపాధ్యాయ కొలువులు సహా ఏకంగా 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగుల ఇంట వెలుగులు నింపింది. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ కింద 105 పాఠశాలలు మంజూరు చేసి 84కి అనుమతులిచ్చింది. 22 లక్షల మందికి పైగా విద్యార్థులకు అల్పాహారం, పాలు అందిస్తూ, యువత నైపుణ్యాభివృద్ధికి స్కిల్స్ యూనివర్సిటీ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసింది.
వైద్య, భద్రత, మౌలిక వసతుల రంగాల్లో ప్రగతి రథచక్రాలు అనూహ్య వేగంతో తిరుగుతున్నాయి. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడం, గోషామహల్‌లో రూ.2,700 కోట్లతో 2,000 పడకల ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం, నిమ్స్‌లో రోబోటిక్ సర్జరీలు, 2000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు ప్రభుత్వ వైద్య రంగంలో నవశకానికి నాంది పలికాయి. డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం ‘ఈగల్’, ఆహార కల్తీపై ‘టీ-సేఫ్’, మహిళల భద్రతకు షీ టీమ్స్ బలోపేతం వంటి చర్యలు భద్రతపై భరోసా ఇస్తున్నాయి. భూ పరిపాలనలో ప్రక్షాళన చేస్తూ భూ భారతి, ఏఐ ఆధారిత భూమిత్ర సేవలు తెచ్చి 3.76 లక్షల పాస్‌బుక్స్ జారీ చేసింది. 36 శాఖల్లో ఈ-ఆఫీస్, దేశంలోనే తొలి డిజిటల్ కేబినెట్, వాట్సాప్ ద్వారా 581 సేవలు అందుబాటులోకి తేవడం డిజిటల్ విప్లవానికి సంకేతం. మరోవైపు 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు, 6,092 కిలోమీటర్ల హ్యామ్ రోడ్లు, మెట్రో రెండో దశ విస్తరణ, హైడ్రా ద్వారా 1045 ఎకరాల ప్రభుత్వ భూముల పరిరక్షణ, మూసీ పునరుజ్జీవనానికి 55 కిలోమీటర్ల ప్రణాళిక, గోదావరి జలాల తరలింపు వంటి బృహత్తర ప్రాజెక్టులతో విశ్వనగరంగా హైదరాబాద్ స్థానాన్ని సుస్థిరం చేస్తోంది.
పెట్టుబడుల స్వర్గధామంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతూ, టీజీ-ఐపాస్ ద్వారా రూ.1.29 లక్షల కోట్ల పెట్టుబడులు, టీజీఐఐసీ భూముల్లో రూ.92,281 కోట్లతో 78 వేల ఉద్యోగాలకు అవకాశం కల్పించింది. ఐటీ ఎగుమతులను రూ.3.97 లక్షల కోట్లకు చేర్చి, అమెజాన్ నుంచి 7 బిలియన్ డాలర్ల పెట్టుబడిని రప్పించిన రేవంత్ సర్కార్, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా రాష్ట్రాన్ని నిలపాలని ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్‌తో ముందుకు సాగుతోంది. భారత్ ఫ్యూచర్ సిటీని తొలి నెట్-జీరో స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతూ, జయ జయహే తెలంగాణ గీతానికి అధికారిక గౌరవం కల్పించింది. వెయ్యి రోజుల ఈ సువర్ణ ప్రస్థానం ఒక అద్భుత మైలురాయి మాత్రమే. సంక్షేమాన్ని పంచుతూనే.. అభివృద్ధి, సాంకేతికత, పెట్టుబడుల సమన్వయంతో ‘ప్రజాపాలన’కు అసలైన అర్థం చెబుతున్న ఈ ప్రభుత్వం సాధించిన విజయాలు, రాబోయే స్వర్ణయుగానికి స్పష్టమైన పునాదులు.

Latest