Mahaa Daily Exclusive

  ముళ్లపొదల్లో పసికందు…

Share

ముళ్లపొదల్లో పసికందు.
* పట్వారిగూడెంలో తీవ్ర కలకలం!
* రాత్రివేళ వదిలివెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు.. కాపాడిన స్థానికులు.
* రంగంలోకి దిగిన పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు.. పలు కోణాల్లో ముమ్మర దర్యాప్తు.

దమ్మపేట, మహా:

ఆ చిన్నారికి లోకం ఇంకా తెలియదు.. కానీ లోకం మాత్రం ఆ చిన్నారిని చూసి ప్రశ్నిస్తోంది. తల్లి ఒడిలో వెచ్చగా నిద్రించాల్సిన వేళ.. ముళ్లపొదల్లో ఒంటరిగా పడివున్న నవజాత శిశువు దృశ్యం పట్వారిగూడెం ప్రజల హృదయాలను కలచివేసింది. పుట్టుకతోనే ఏ పాపం చేయని ఓ పసికందు కన్నవారి ప్రేమకు నోచుకోకముందే ముళ్ల మధ్యకు చేరిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పట్వారిగూడెంలో తీవ్ర కలకలం రేపింది.
గురువారం రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు పట్వారిగూడెం ఎస్సీ కాలనీ సమీపంలోని ఓ ఆర్ఎంపీ వైద్యుడి క్లినిక్ వద్ద ఉన్న ముళ్లపొదల్లో పసికందును వదిలివెళ్లారు. రాత్రి చీకటిలో ఎవరికీ కనిపించకుండా అక్కడ వదిలివెళ్లిన ఆ శిశువు తెల్లవారేసరికి స్థానికుల కంటపడింది. ఉదయం అటుగా వెళ్తున్న కొందరు స్థానికులు ముళ్ల మధ్య కదలికలను గమనించి దగ్గరకు వెళ్లి చూడగా, ప్రాణం కోసం విలవిలలాడుతున్న నవజాత శిశువు కనిపించింది. ఈ దృశ్యం చూసిన వారు తీవ్రంగా చలించిపోయారు. వెంటనే ఆ చిన్నారిని ముళ్లపొదల నుంచి సురక్షితంగా బయటకు తీసి సమీపంలోని ఓ ఇంటికి తరలించారు. అనంతరం స్థానికుల సమాచారం మేరకు మహిళా సంక్షేమ అధికారిని హేమసత్య, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శిశువు సంరక్షణకు తక్షణ చర్యలు చేపట్టారు.
పుట్టిన బిడ్డను రక్షించాల్సిన చేతులే ఆ చిన్నారిని నిర్జన ప్రదేశంలో వదిలివెళ్లే పరిస్థితి ఎందుకు వచ్చిందన్న ప్రశ్నలు ఇప్పుడు స్థానికులను వెంటాడుతున్నాయి. ఈ ప్రాంతానికి చెందిన వారెవరైనా ప్రసవ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఇలా చేసి ఉంటారా? లేక ఎవరైనా అక్రమ సంబంధం నేపథ్యంలో గర్భం దాల్చి, ఆ విషయాన్ని కప్పిపుచ్చుకునే యత్నంలో ఈ దారుణానికి ఒడిగట్టారా? అన్న కోణాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చీకటిలో ఎవరో చేసిన నిర్దయకు.. తెల్లవారుజామున మనుషుల స్పందన ఓ సమాధానంగా నిలిచింది. పుట్టిన బిడ్డకు పేరు పెట్టకముందే ఓ గ్రామం ఆ చిన్నారికి అండగా నిలిచిన దృశ్యం మానవత్వం ఇంకా చావలేదని నిరూపించింది.
ప్రస్తుతం పోలీసుల ముందు అనేక ప్రశ్నలు సవాల్‌గా మారాయి. ఆ పసికందును ఎవరు అక్కడికి తీసుకొచ్చారు, శిశువు తల్లిదండ్రులు ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇటీవల పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా ప్రసవం జరిగిందా, ఆ ప్రాంతానికి రాత్రి సమయంలో ఎవరైనా అనుమానాస్పదంగా వచ్చారా అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. దర్యాప్తు పూర్తయితేనే ఈ ఘటన వెనుక దాగిన అసలు నిజం వెలుగులోకి రానుంది. ఈ ఘటనలో నిందితులు ఎవరన్నది తేలడంతో పాటు, ముళ్ల మధ్య దొరికిన ఆ చిన్నారి జీవితం ఇక ముళ్లబాట కాకుండా సురక్షితంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత సమాజంపై ఉంది.