Mahaa Daily Exclusive

  బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు భారీ ఊరట…..

Share

  • బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు భారీ ఊరట.
  • రిమాండ్ తిరస్కరించిన నాంపల్లి కోర్టు.
  • స్పీకర్‌పై వ్యాఖ్యల కేసులో తాతా మధు, నవీన్ రెడ్డికి బెయిల్.. రూ.10 వేల పూచీకత్తు.
  • అరెస్టు చేసిన గంటల్లోనే కోర్టు కీలక ఆదేశాలు.
  • 2 షూరిటీలు సమర్పిస్తే విడుదల.

 

హైదరాబాద్, మహా .

శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్ రెడ్డికి నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. వీరిద్దరికి రిమాండ్ విధించేందుకు కోర్టు నిరాకరించింది. ఒక్కొక్కరు రూ.10 వేల పూచీకత్తుతో పాటు 2 షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. షూరిటీలు సమర్పించిన అనంతరం ఇద్దరినీ విడుదల చేయాలని కోర్టు స్పష్టం చేసింది.

 

స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై ఎమ్మెల్సీలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో స్పీకర్ ఓఎస్డీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలోని నిబంధనల కింద కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం ఉదయం తాతా మధు, నవీన్‌కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

 

అనంతరం ఇద్దరినీ నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసుకు సంబంధించిన వివరాలను నమోదు చేసిన పోలీసులు న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. ఎమ్మెల్సీలను రిమాండ్‌కు తరలించాలని పోలీసులు కోరగా.. కేసులోని అంశాలను పరిశీలించిన నాంపల్లి కోర్టు రిమాండ్ విధించేందుకు నిరాకరించింది.

 

ఇద్దరు ఎమ్మెల్సీలు రూ.10 వేల చొప్పున పూచీకత్తు సమర్పించడంతో పాటు 2 షూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అవసరమైన షూరిటీలు సమర్పించిన వెంటనే వారిని విడుదల చేయాలని స్పష్టం చేసింది.

 

ఈ పరిణామంతో తాతా మధు, నవీన్‌కుమార్ రెడ్డికి తక్షణ ఉపశమనం లభించినట్లయింది. మరోవైపు స్పీకర్‌పై వ్యాఖ్యల వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో కేసు తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.