Mahaa Daily Exclusive

  అభివృద్ధితో ఓటు బ్యాంక్ పెంచుకుందాం…

Share

  • అభివృద్ధితో ఓటు బ్యాంక్ పెంచుకుందాం.
  • టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు.
  • డేటా సెంటర్లకు నీరు సమస్యే కాదు.
  • మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.
  •  ఏపీని దేశంలో నంబర్‌ వన్‌గా నిలపడమే లక్ష్యం.

 

అమరావతి:మహా.

 

అభివృద్ధి పనులతో ప్రజల్లో సానుకూలత పెంచుకోవాలని, ఓటు వేసే అలవాటు లేని వారిని కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములను చేయాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విమర్శలను కూడా సానుకూలంగా మార్చుకుని ప్రజల మద్దతు కూడగట్టాలని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం ద్వారా పార్టీ ఓటు బ్యాంక్‌ను పెంచుకోవాలని సూచించారు.

 

టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో సుస్థిర అభివృద్ధిపై మంగళవారం జరిగిన చర్చలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్ర స్థూల అభివృద్ధికి నియోజకవర్గ స్థాయి అభివృద్ధిని అనుసంధానం చేయాలని సూచించారు. నియోజకవర్గాల గ్రాస్ డొమెస్టిక్ ప్రాడెక్ట్ పెరిగేలా అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించాలని అన్నారు. విజయవాడ సెంట్రల్, పాలకొల్లు, మండపేట, చిలకలూరిపేట, నెల్లూరు సిటీ, తణుకు నియోజకవర్గాలు ఈ విషయంలో ముందంజలో ఉన్నాయని పేర్కొన్నారు.

 

అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతున్నాయనే భావన కలిగేలా వాటిని వారి వద్దకు తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. ప్రతి నియోజకవర్గంలో స్థానిక అవసరాలు, అందుబాటులో ఉన్న వనరులు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను గుర్తించి అభివృద్ధికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.

 

డేటా సెంటర్లకు నీరు సమస్య కాదు

 

ఆంధ్రప్రదేశ్‌కు గూగుల్ వంటి భారీ పెట్టుబడులు రావడం చూసి దేశంలోని ఇతర రాష్ట్రాలు అసూయపడే పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో కొందరు వ్యక్తులు కుట్రలు చేస్తూ పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. డేటా సెంటర్లకు అవసరమయ్యే 5 టీఎంసీల నీరు రాష్ట్రానికి పెద్ద సమస్య కాదని స్పష్టం చేశారు.

 

పోలవరం ఎడమ కాలువ ద్వారా రోజుకు దాదాపు 2 టీఎంసీల నీటిని తీసుకెళ్లే అవకాశం ఉందని తెలిపారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, లక్షల మందికి ఉపాధి కల్పించే సామర్థ్యం ఈ రంగానికి ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.

 

మూడేళ్లలో 36 ప్రాజెక్టులు

 

2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర జీఎస్డీపీ రూ.20.35 లక్షల కోట్లుగా ఉందని చంద్రబాబు తెలిపారు. 15 నుంచి 20 రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలను విస్తరించేలా నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, సేవల రంగాల్లో వేగం పెంచాలని అన్నారు.

 

ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ ఈ ఏడాది గోదావరి నుంచి దాదాపు 1,000 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లిందని చంద్రబాబు పేర్కొన్నారు. అందులో కనీసం 300 టీఎంసీలను వినియోగించుకోగలిగితే రాష్ట్ర పరిస్థితులను గణనీయంగా మార్చవచ్చని అన్నారు. మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో రాష్ట్రంలోని 36 ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రకటించారు. పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.

 

వంశధార, గోదావరి, కృష్ణ, తుంగభద్ర, కావేరి, పెన్నా నదులను అనుసంధానం చేయగలిగితే రాష్ట్రంలోని రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో నింపుకునే అవకాశం ఉంటుందని చంద్రబాబు అన్నారు. నీటి వనరుల సమర్థ వినియోగంతో రాష్ట్రంలో సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలను మరింత సమర్థంగా తీర్చవచ్చని వివరించారు.

 

1,400 టీఎంసీలు నిల్వ చేస్తే చరిత్ర మార్చొచ్చు

 

రాష్ట్రంలో నీటి నిల్వ సామర్థ్యాన్ని భారీగా పెంచాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. వెలిగొండలో ఈ సీజన్‌లో 10.7 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నామని, వచ్చే ఏడాది 50 టీఎంసీలు నిల్వ చేసేలా చర్యలు చేపడతామని తెలిపారు. పోలవరం ఫేజ్-2 పూర్తయితే 190 టీఎంసీల వరకు నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని, బొల్లాపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే మరో 350 టీఎంసీల నిల్వ సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు.

 

కడప జిల్లాలోని ప్రాజెక్టుల ద్వారా దాదాపు 100 టీఎంసీలు నిల్వ చేసుకునే అవకాశం ఉందని, నెల్లూరు జిల్లాలో సోమశిల, కండలేరు వంటి జలాశయాలు ఉన్నాయని గుర్తుచేశారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నింటినీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తే 1,250 నుంచి 1,400 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఏర్పడుతుందని, అలా చేయగలిగితే రాష్ట్ర చరిత్రనే మార్చవచ్చని చంద్రబాబు అన్నారు.

 

బయటి ప్రాంతాల నుంచి నదుల ద్వారా నీటిని తీసుకురావడం ఎంత ముఖ్యమో, రాష్ట్రంలో కురిసే వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చడం కూడా అంతే ముఖ్యమని చెప్పారు. భూగర్భ జలాలు పెరిగితే విద్యుత్‌కు అందించే సబ్సిడీ వ్యయం తగ్గుతుందని, విద్యుత్ ప్రసార ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంటుందని వివరించారు.

 

దేశంలో ఏపీ నంబర్‌ వన్ కావాలి

 

దేశంలో గత 30 ఏళ్లలో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో అత్యంత సౌకర్యవంతమైన హైవేలు నిర్మిస్తున్నామని, పోర్టులు, విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మైక్రో ఇరిగేషన్‌ను తీసుకొచ్చింది కూడా తమ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.

 

సంపద సృష్టించడానికి డబ్బులు లేవని కూర్చుంటే పరిష్కారం దొరకదని, ఆలోచన చేస్తే మార్గం కనిపిస్తుందని అన్నారు. దేశంలోనే నంబర్‌ వన్ డెవలపర్‌గా ఆంధ్రప్రదేశ్‌ను నిలపడం తన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. సాస్కి, ప్రభుత్వ నిధులు, నాబార్డ్ తదితర మార్గాల ద్వారా అందుబాటులోకి వచ్చే నిధులను సమర్థంగా వినియోగించుకునేందుకు రూపకల్పన సిద్ధం చేసుకున్నామని తెలిపారు.

 

రూ.30 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాం

 

రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైన అభివృద్ధి నమూనాలను రూపొందించుకోవాలని చంద్రబాబు సూచించారు. ఆలోచనా విధానం మారితే ప్రతి ప్రాంతాన్నీ అభివృద్ధి చేయవచ్చని అన్నారు. కుప్పం సమీపంలో జాతీయ రహదారికి దగ్గరగా పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి చేశామని, దాని ద్వారా రూ.30 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని తెలిపారు.

 

‘వన్ ఫ్యామిలీ.. వన్ ఎంట్రప్రెన్యూర్’ విధానాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తే స్థానికంగా ఆర్థిక కార్యకలాపాలు పెరిగి అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని చంద్రబాబు అన్నారు. అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలని సూచించారు.

 

ప్రభుత్వ విధానాలు పెట్టుబడులకు అనుకూలంగా ఉండాలని, ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ద్వారా ప్రాజెక్టులు వేగంగా ఏర్పాటయ్యేలా చూడాలని పార్టీ నాయకులకు సూచించారు. ప్రజలకు ఇబ్బందిగా ఉన్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటికి సరైన పరిష్కారాలను సూచించాలని ఆదేశించారు.

 

అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి, మౌలిక వసతులు వంటి అంశాలను నియోజకవర్గాల స్థాయిలో ముందుకు తీసుకెళ్లడంతో పాటు వాటి ఫలితాలను ప్రజలకు చేరవేయాలని చంద్రబాబు సూచించారు. అభివృద్ధి పనులే పార్టీకి ప్రజల మద్దతును మరింతగా పెంచేలా పనిచేయాలని టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.