హస్తకళాకారుల అభివృద్ధికి కామన్ ఫెసిలిటీ సెంటర్లు.
* హస్తకళా ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్.
* ప్రతి కళాకారుడి వివరాలు తెలిసేలా QR కోడ్.
* కళాకారులు పస్తులు ఉండకూడదు.
* పనికి ఆటంకం కలగకూడదు.
* ఉచిత వైద్య సేవలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టి.
అమరావతి, మహా:
ఆంధ్రప్రదేశ్‌లో హస్తకళాకారుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. కళాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడంతో పాటు వారి ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
హస్తకళాకారులకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు క్లస్టర్ల వారీగా కామన్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో సవర కళాకారుల సెంటర్ పనులను ప్రారంభించినట్లు తెలిపారు. వీబీ–జీ రామ్ జీ నిధులతో ఈ సెంటర్ నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు.
మదనపల్లి, అనంతపురం, పెడన ప్రాంతాల్లో కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుకు స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని పవన్ తెలిపారు. త్వరలో ఆయా ప్రాంతాల్లో నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. కళాకారులకు ఉత్పత్తి, శిక్షణ, నిల్వ, మార్కెటింగ్ తదితర అవసరాలకు ఈ సెంటర్లు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.
ఉదయగిరి కమ్యూనిటీ సెంటర్‌కు రూ.12 లక్షలు
ఉదయగిరి కమ్యూనిటీ సెంటర్ అభివృద్ధికి రూ.12 లక్షలు కేటాయించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. ఎంపీ ల్యాడ్స్ నిధులతో సెంటర్‌కు మరమ్మతులు చేపడుతున్నామని చెప్పారు. ప్రహరీ గోడ, మరుగుదొడ్లు, స్టోర్ రూమ్ నిర్మాణానికి అవసరమైన నిధులు విడుదల చేస్తామని వెల్లడించారు.
ఏటికొప్పాక ఆరోగ్య కేంద్రం పనులను కూడా పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని పవన్ తెలిపారు. హస్తకళాకారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.
ప్రతి కళాకారుడి వివరాలు QR కోడ్‌లో
హస్తకళా ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేందుకు చర్యలు వేగవంతం చేశామని పవన్ కల్యాణ్ తెలిపారు. ఉత్పత్తులపై QR కోడ్ ఏర్పాటు చేసే ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు.
QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఆ ఉత్పత్తిని తయారు చేసిన కళాకారుడి వివరాలతో పాటు ఆయన చేసిన శ్రమ, ఉత్పత్తికి సంబంధించిన సమాచారం వినియోగదారులకు అందేలా వ్యవస్థను రూపొందిస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల కళాకారుడి గుర్తింపు పెరగడంతో పాటు వారి ఉత్పత్తులకు మార్కెట్లో ప్రత్యేక విలువ లభించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
గ్లోబల్ మార్కెట్‌తో అనుసంధానం
రాష్ట్రంలోని హస్తకళలను దేశీయ మార్కెట్‌కే పరిమితం చేయకుండా ప్రపంచ మార్కెట్లకు అనుసంధానం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పవన్ కల్యాణ్ వివరించారు. నాణ్యమైన హస్తకళా ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంతో పాటు కళాకారులకు మెరుగైన ఆదాయ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని అన్నారు.
హస్తకళాకారుల సంక్షేమానికి మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్ వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కళాకారుల శ్రమకు తగిన గుర్తింపు, గౌరవం, ఆదాయం లభించేలా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.
కళాకారులకు ఉచిత వైద్య శిబిరాలు
హస్తకళాకారుల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా హస్తకళాకారుల కోసం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తామని చెప్పారు.
ఇప్పటికే నిర్వహించిన 6 ఉచిత నేత్ర వైద్య శిబిరాల్లో 1,708 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. వారిలో సుమారు 93 మందికి ఉచితంగా శుక్లాల ఆపరేషన్లు చేసినట్లు తెలిపారు. మరో 1,253 మందికి పైగా ఉచిత కళ్లద్దాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
హస్తకళాకారులు ఆర్థిక ఇబ్బందులతో పస్తులు ఉండకూడదని, వారి పనికి ఎలాంటి ఆటంకం కలగకూడదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కళాకారుల జీవనోపాధిని కాపాడుతూ వారి ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడం, ఆరోగ్య భద్రత అందించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వంటి అంశాలను సమగ్రంగా ముందుకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.








